గోదావరి నీటిపై కొత్త పేచీ!

16 Dec, 2014 01:50 IST|Sakshi
గోదావరి నీటిపై కొత్త పేచీ!

* తెలంగాణలో ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు
* నీటి లభ్యత లేని సమయాల్లో దిగువన పరిస్థితేంటని వాదన
* గోదావరి బోర్డుకు నివేదించాలని నిర్ణయం.. 23న బోర్డు భేటీలో చర్చకు వచ్చే అవకాశం
* గట్టి సమాధానం చెప్పాలని భావిస్తున్న తెలంగాణ సర్కారు

సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాల వినియోగంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య వివాదం ముదిరే అవకాశం కనిపిస్తోంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో గోదావరి నీటిని ఎగువన తెలంగాణ రాష్ర్టమే పూర్తిగా వాడేసుకుంటే దిగువన ఉన్న తమ రాష్ర్ట ప్రయోజనాలు దెబ్బతింటాయని ఏపీ ఆందోళన వ్యక్తంచేస్తోంది. ముఖ్యంగా గోదావరిలో నీటి లోటు ఉండే సమయాల్లో లభ్యమయ్యే నీటినంతా ఎగువ రాష్ర్టమే వినియోగిస్తే.. దిగువ రాష్ర్ట అవసరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తోంది.

సాధారణంగా ఖరీఫ్ ప్రారంభంలో నీటి లోటు అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వచ్చే నీటిని తెలంగాణ ప్రాజెక్టుల నుంచి దిగువకు వదలకపోతే ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆ రాష్ర్ట ప్రభుత్వం వాదిస్తోంది. ఈ నేపథ్యంలో లోటు సమయాల్లో నీటి కేటాయింపులు ఎలాగన్న దానిపై ముందుగా తేల్చాలని గోదావరి నదీ యాజమాన్య బోర్డును ఆశ్రయించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. ఈ నెల 23న జరిగే గోదావరి బోర్డు సమావేశంలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చే అవకాశముంది.

గోదావరి నదీ వివాదాల ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నదిలో నికరంగా ఏటా 1,200 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంటుండగా 900 టీఎంసీల మేర తెలంగాణ, మరో 300 టీఎంసీలను ఏపీ వాడుకునే వెసులుబాటు ఉంది. ఈ మొత్తం నీటిలో ప్రాణహిత-చేవెళ్లకు 160 టీఎంసీల కేటాయింపులు ఉండగా, కంతనపల్లి ప్రాజెక్టుకు మరో 50 టీఎంసీలను కేటాయించారు. ప్రాణహితతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు సాగుకు తెలంగాణ సర్కారు లక్ష్యంగా పెట్టుకుంది.

ఇక గోదావరి నికర, మిగులు జలాలు వాడుకునేందుకు వరంగల్ జిల్లా ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి 22.5 టీఎంసీల నీటి నిల్వకు సంకల్పించారు. దీని ద్వారా తెలంగాణలోని మూడు జిల్లాల పరిధిలో 7.50 లక్షల ఆయకట్టును స్థిరీకరించే అవకాశముంది. అయితే గోదావరి నదీప్రవాహం ప్రాణహిత, కంతనపల్లిని దాటి దిగువన ఏపీ నిర్మిస్తున్న పోలవరానికి రావాల్సి ఉంది. కంతనపల్లికి ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ఇంద్రావతిలో 300 టీఎం సీల మేర మిగులు జలాలు ఉండగా అవన్నీ కాళేశ్వరం వద్ద గోదావరిలోనే కలుస్తాయి.

ఈ మిగులు జలాలను ఆధారం చేసుకొంటే.. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కంటే ఎక్కువే దక్కుతాయని ఏపీ వాది స్తోంది.  ఎగువన ఉన్న తెలంగాణ ప్రాజెక్టులపై అభ్యంతరం తెలుపుతూ గోదావరి బోర్డుకు నివేదించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది. దీనికి గట్టి జవాబివ్వాలని తెలంగాణ  నిర్ణయించింది. సీలేరు, శబరిల్లో భారీ ప్రవాహాలు ఉంటాయని, గోదావరిలో లభించే నీటితో పోలిస్తే దిగువనే ఎక్కువ నీరు లభిస్తుందని, ఈ దృష్ట్యా ఏపీకి   నష్టమేమీ లేదని తెలంగాణ వాదిస్తోంది.

మరిన్ని వార్తలు