రైతు సంక్షేమంలో ఏపీ భేష్‌

31 Dec, 2019 04:56 IST|Sakshi

‘సాక్షి’ ఇంటర్వ్యూలో నాబార్డు డిప్యూటీ ఎండీ చింతల గోవిందరాజులు

సాక్షి, అమరావతి: ‘‘రైతు సంక్షేమ పథకాల అమల్లో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానంలో నిలుస్తోంది. వైఎస్సార్‌ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, ఉచిత పశు బీమా, ధరల స్థిరీకరణ నిధి, ముందుగానే గిట్టుబాటు ధరల ప్రకటన, కౌలు రైతుల సంక్షేమానికి కొత్త చట్టం వంటివి అమలు చేయడం ప్రశంసనీయం. ఉచిత పంటల బీమా పథకం రైతులకు ఎంతగానో మేలు చేస్తుంది. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలపై దృష్టి సారిస్తే రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయొచ్చు’’ అని జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్‌) డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ చింతల గోవిందరాజులు (జీఆర్‌ చింతల) చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం బ్రాహ్మణకోడూరుకు చెందిన జీఆర్‌ చింతల.. ఇటీవలే నాబార్డ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఆయన పాఠశాల విద్య గుంటూరులోని పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో పూర్తిచేశారు. ఢిల్లీలోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థలో (ఐఏఆర్‌ఐ) పోస్టు గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం ‘సాక్షి’ ప్రతినిధితో ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు. 

జీఆర్‌ చింతల ఏం చెప్పారంటే...  
ఏ పథకమైనా విజయవంతం కావాలంటే ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి. అప్పుడే సమీకృత అభివృద్ధి సాధ్యమవుతుంది. సాధారణంగా రైతులకు చేయూతనివ్వడానికి ఎవరూ ముందుకు రారు. వారి పరిస్థితి గాలిలో దీపంలా మారింది. అన్నదాతల సంక్షేమం కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రవేశపెట్టడం మంచి పరిణామం. సంక్షేమంతో పాటు శాశ్వత మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఉచిత పంటల బీమా, పశువుల బీమా పథకాలు అద్భుతమని చెప్పొచ్చు. రైతులకు ఇప్పుడు కావాల్సినవి ఇవే. రైతులను ప్రోత్సహించి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయాలి. వ్యవసాయ ఉత్పత్తులకు ఎక్కువ ధర వచ్చేలా చూడాలి. ఫ్యూచర్‌ ట్రేడింగ్‌ వైపు రైతును మళ్లించాలి. తాను పండించిన పంటకు తానే ధర నిర్ణయించి అమ్ముకునే పరిస్థితి వస్తే రైతే రాజవుతాడు. ఈ మేరకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేయగలిగితే రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గుతుంది. 

ముఖ్యమంత్రిని కలుస్తా..
వ్యవసాయ మిషన్‌ సహా వివిధ అంశాలపై చర్చించేందుకు త్వరలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని, వ్యవసాయ మంత్రిని, ఇతర అధికారులను కలవాలనుకుంటున్నా. నాబార్డు నుంచి ఏయే పథకాలకు నగదు సాయాన్ని పొందవచ్చో చెప్పి, రైతులు గరిష్టంగా లబ్ధి పొందేలా చూస్తా. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో చాలా పథకాలున్నా అన్నదాతలు పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు.

జెట్టీల కోసం రాయితీపై రుణం
ఫిషరీస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ను కొత్తగా ఏర్పాటు చేశాం. దీన్ని ఉపయోగించుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే నాబార్డు, కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవాలి. అధునాతన జెట్టీల కోసం రూ.వందల కోట్ల రుణాన్ని రాయితీపై పొందవచ్చు. పొడవైన తీరప్రాంతం, లక్షలాది మంది మత్స్యకారులు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఇది చాలా మేలు చేస్తుంది. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే 3 జెట్టీల కోసం ఒప్పందం చేసుకుంది. 

అన్నదాతల ఆత్మహత్యలు ఆగాలంటే.. 
రైతాంగం పాతకాలపు ఆలోచనలు వదిలేయాలి. ప్రభుత్వాలు సంక్షేమంతోపాటు ఈ–నామ్‌ మార్కెట్లను ప్రోత్సహించాలి. స్థానిక వ్యాపారులతో పాటు జాతీయ వ్యాపారులు తెరపైకి వచ్చినప్పుడే వ్యవసాయ ఉత్పత్తులకు మంచి ధరలు లభిస్తాయి. కనీస మద్దతు ధరలు రాబట్టేలా పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలి. మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌ను పెంపొందించుకోవాలి. వ్యవస్థాగతమైన యంత్రాంగాలను ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. అప్పుడే వారు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉంటారు. ఆత్మహత్యలకు పాల్పడరు.   

>
మరిన్ని వార్తలు