వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణలో ఏపీకి అగ్రస్థానం

19 Feb, 2020 04:21 IST|Sakshi

అమలు బాగుందంటూ కేంద్రం కితాబు

66 మార్కులతో టాప్‌లో ఆంధ్రప్రదేశ్‌

58 మార్కులతో రెండో స్థానంలో గోవా, తమిళనాడు 

37 మార్కులతో 19వ స్థానంలో తెలంగాణ

సాక్షి, అమరావతి: ‘ఆయుష్మాన్‌ భారత్‌’ పథకం అమలులో భాగంగా హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్‌ 66 మార్కులతో మొదటి ర్యాంక్‌ దక్కించుకుంది. ఆయుష్మాన్‌ భారత్‌లో రెండు రకాల సేవలు ఉంటాయి. ఒకటి.. జన ఆరోగ్య యోజన (ఆరోగ్యశ్రీ తరహా) కాగా రెండోది హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణ. గ్రామీణ ప్రాంతాల్లో పేద రోగులకు వైద్యసేవలు అందించడం, వారి వివరాలను నమోదు చేయడం, వాటిని కేంద్ర ఆరోగ్య శాఖ పోర్టల్‌కు అనుసంధానించడం వంటి విషయాల్లో ఆంధ్రప్రదేశ్‌ మంచి ప్రతిభ కనబరిచినట్టు కేంద్రం కితాబిచ్చింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి వికాస్‌ షీల్‌ ఆయా రాష్ట్రాలకు లేఖ రాశారు. 2019 డిసెంబర్, 2020 జనవరి నెలలకు సంబంధించి ఆయా రాష్ట్రాల ప్రతిభను లెక్కించారు. ఇందులో 58 మార్కులతో గోవా, తమిళనాడు రెండో స్థానంలో, 57 మార్కులతో గుజరాత్‌ మూడో స్థానంలో నిలిచాయి. తెలంగాణ 37 మార్కులతో 19వ స్థానంలో నిలిచింది. కాగా.. హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్ల నిర్వహణకు కేంద్రం నిధులు ఇస్తుంది.

మాతృవందన యోజనలోనూ ఏపీదే అగ్రస్థానం
దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రధానమంత్రి మాతృవందన యోజనలోనూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు మొదటి ర్యాంక్‌ వచ్చిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంత గర్భిణులకు ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడం, వారికి వైద్య పరీక్షలు చేయించడం, బిడ్డ పుట్టాక వారికి సకాలంలో వ్యాధి నిరోధక టీకాలు వేయించడం చేస్తారు. ఇందుకు దశలవారీగా రూ.5 వేలు ఆ మహిళకు చెల్లిస్తారు. ఇలా ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడంలో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా పథకం అమలులో జిల్లాలను ప్రతిభ ఆధారంగా గుర్తించగా కర్నూలు జిల్లాకు రెండో ర్యాంకు వచ్చింది.

మరిన్ని వార్తలు