‘ఉపాధి’లో దేశంలోనే ఏపీ టాప్‌

16 May, 2020 03:11 IST|Sakshi

రోజూ రూ. 30 కోట్ల మేర కూలీలకు పనుల కల్పన

కూలీలకు పని కల్పనలో మన రాష్ట్రం ముందంజ

15 రోజుల్లో కొత్తగా 25,940 కుటుంబాలకు జాబ్‌ కార్డులు 

లాక్‌డౌన్‌లోనూ గ్రామీణ పేదలకు జీవనోపాధి కల్పనపై ప్రభుత్వం దృష్టి 

నగరాల నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలకు ‘ఉపాధి’ పనులు

దేశంలో నాలుగో వంతు ‘ఉపాధి’ మన రాష్ట్రంలోనే..

సాక్షి, అమరావతి: ప్రస్తుత లాక్‌డౌన్‌ పరిస్థితుల్లోనూ గ్రామీణ నిరుపేదలకు ఉపాధి హామీ పథకం ద్వారా జీవనోపాధి కల్పించేందుకు గత 15 రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో కొత్తగా 25,940 కుటుంబాలకు ప్రభుత్వం జాబ్‌ కార్డులను జారీ చేసింది. ప్రత్యేక నైపుణ్యం ఉండి నగరాల్లో వివిధ పరిశ్రమల్లో పనిచేసే వందల మంది వలస కూలీలు కొద్ది రోజులుగా వారి సొంత గ్రామాలకు తిరిగి రావడం తెలిసిందే. అలా సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వారికీ ఈ విపత్కర రోజుల్లో జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 4,353, కృష్ణాలో 3,704, ప్రకాశం జిల్లాలో 3,510, చిత్తూరులో 2,610, విజయనగరం జిల్లాలో 2,405 కుటుంబాలకు కొత్తగా ఉపాధి హామీ పథకం జాబ్‌ కార్డులు జారీ చేసి పనులు కల్పించారు. 

రోజూ రూ.30 కోట్ల మేర కూలీలకు పనుల కల్పన
రూ.703 కోట్ల లబ్ధి..
లాక్‌డౌన్‌ విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలోని గ్రామీణ నిరుపేద కూలీలకు ఉపాధి పథకం ద్వారా రోజూ రూ.30 కోట్ల వరకు ప్రభుత్వం పనులు కల్పిస్తోంది. కరోనా భయంతో ఏప్రిల్‌ మొదట్లో కూలీలు ఉపాధి పనులకు వచ్చేందుకు ఆసక్తి చూపలేదు. దీంతో అప్పట్లో పనుల కల్పన తక్కువగా ఉన్నా, రానురాను పనుల కల్పనను ప్రభుత్వం భారీగా పెంచింది. గత 45 రోజుల వ్యవధిలో 23.96 లక్షల కుటుంబాలు మొత్తం రూ.703.28 కోట్ల విలువైన ఉపాధి హామీ పథకం పనులు చేసి లబ్ధి పొందారు. 

మన రాష్ట్రంలోనే అత్యధికం
► లాక్‌డౌన్‌ అమలు తర్వాత ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి గత 45 రోజులుగా గ్రామాల్లో నిరుపేద కూలీలకు ఉపాధి హామీ çపథకం ద్వారా పనులు కల్పించడంలో మన రాష్ట్రం పూర్తి ముందంజలో ఉంది.
► 45 రోజుల వ్యవధిలో దేశమంతటా 1.06 కోట్ల కుటుంబాలకు 13.60 కోట్ల పనిదినాల పాటు ఉపాధి పథకం ద్వారా çకూలీలకు పనులు కల్పిస్తే.. అందులో దాదాపు నాలుగో వంతు అంటే, 23.96 లక్షల కుటుంబాలకు 3.09 కోట్ల పనిదినాల పాటు మన రాష్ట్రంలోని నిరుపేద కూలీలు ‘ఉపాధి’ పొందారు. 
► గత 15 రోజుల్లో కొత్తగా జారీ చేసిన జాబ్‌ కార్డులతో కలిపి ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో జాబ్‌కార్డులున్న కుటుంబాల సంఖ్య మొత్తం 63.07 లక్షలకు చేరింది.

మరిన్ని వార్తలు