నష్టాన్ని పరిశీలించిన మంత్రి అవంతి శ్రీనివాస్‌

28 Aug, 2019 13:15 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఇటీవల వచ్చిన వరదలతో భవానీ ద్వీపం ఐదడుగుల మేర నీట మునిగి, రూ.2 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని ఆంధ్రపదేశ్‌ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ వెల్లడించారు. బరంపార్కు, భవానీ ద్వీపంలో వరద వల్ల దెబ్బతిన్న ప్రాంతాన్ని మంత్రి మంగళవారం పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వరదల వల్ల భవానీ ద్వీపంలోని రక్షణ గోడ, ల్యాండ్‌ స్కేపింగ్, టవర్, రెస్టారెంట్‌లు, మ్యూజికల్‌ ఫౌంటేన్‌కు తీవ్ర నష్టం జరిగిందన్నారు. భవానీ ద్వీపానికి చిహ్నమైన పైలాన్‌ కాంక్రీట్‌ బేస్‌మెంట్‌ దెబ్బతిన్నదని, 44 రోజుల్లో వీటిని పునరుద్ధరించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి తెలిపారు.

భవానీ ద్వీపంలో టీడీపీ హయాంలో నాసిరకం పనులు జరిగాయని, వరదలు వస్తాయని తెలిసినా కూడా అందుకు తగిన విధంగా  భవానీ ద్వీపాన్ని అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. దీనిపై విచారణ జరిపిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం విజయవాడ కనకదుర్గమ్మ గుడి నుంచి భవానీ ఐలాండ్‌కు రోప్‌వే ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం లాగా బాహుబలి గ్రాఫిక్స్‌ చూపించబోమని ఎద్దెవావ చేశారు. లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తడం సహజమని, అందుకే లోతట్టు ప్రాంతాల్లో నిర్మాణాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తలు వహించాలన్నారు. రాష్ట్రాన్ని టూరిజంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని, ద్వీపంలోకి సెప్టెంబర్‌ 1 నుంచి సందర్శకుల్ని యధావిధిగా అనుమతిస్తామని వివరించారు. 

మరిన్ని వార్తలు