‘మెడ్‌టెక్‌’ మెడకు ఉచ్చు!

2 Jun, 2019 11:30 IST|Sakshi

విచారణకు నోటీసులు జారీచేసిన ‘విజిలెన్స్‌’

రూ.708 కోట్ల నుంచి రూ.2,350 కోట్లకు అడ్డగోలుగా అంచనాల పెంపు

ఆరోగ్య శాఖలో ఇదే పెద్ద కుంభకోణమంటూ ఆ శాఖలో చర్చ

కాంట్రాక్టు రద్దయినా రూ.53 కోట్ల అడ్వాన్స్‌ను వసూలు చేయని చంద్రబాబు సర్కారు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో అతిపెద్ద కుంభకోణంగా మారిన ‘మెడ్‌టెక్‌ జోన్‌’ మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. వైద్య ఉపకరణాల తయారీ పేరుతో విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ సమీపంలో అత్యంత విలువైన 270 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇష్టారాజ్యంగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టడంతో పాటు అక్కడ జరిగిన నిర్మాణాల్లో భారీగా అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో విజిలెన్స్‌ విభాగం విచారణ చేపట్టింది. అందులో భాగంగా విశాఖలోని ఏఎంటీజడ్‌ (ఆంధ్రా మెట్‌టెక్‌ జోన్‌) కార్యాలయానికి  తాజాగా నోటీసులు జారీచేశారు. ఇందులో ప్రధానంగా భూముల కేటాయింపుతో పాటు, అక్కడ నిర్మాణాలకు భారీగా అంచనాలు పెంచి కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు బలమైన ఆరోపణలున్నాయి.

చంద్రబాబు సర్కారు నియమించిన కేపీఎంజీ అనే కన్సల్టెన్సీ సంస్థ అక్కడ నిర్మాణాలకు రూ.708 కోట్లతో  అంచనాలు రూపొందిస్తే.. ఏఎంటీజడ్‌ అధికారులు మాత్రం అడ్డగోలుగా దీన్ని రూ.2,350 కోట్లకు పెంచేశారు. డిఫాల్టర్‌గా పేరుపొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ సంస్థ అయిన ల్యాంకో ఇన్‌ఫ్రాకు కాంట్రాక్టు అప్పగించడం.. మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.53 కోట్లు ఇవ్వడం, ఆ తర్వాత టెండరు రద్దయినా ఆ మొత్తాన్ని రికవరీ చేయకపోవడం వంటి ఆరోపణలపై విజిలెన్స్‌ అధికారులు నోటీసులు జారీచేశారు. లగడపాటి సంస్థకు సంబంధించిన టెండరు రద్దుచేయగానే పవర్‌మెక్‌ అనే మరో సంస్థను తెరమీదకు తెచ్చి పనులు చేయించారు.

అంతేకాక.. ఎన్నికల ఫలితాలు వెలువడిన మే 23కు నాలుగు రోజుల ముందే పవర్‌మెక్‌కు రూ.100 కోట్లు చెల్లింపులు చేయడంతో దీనిపై అనుమానాలు పెరిగాయి. పైగా దీనిపై కోర్టులో వ్యాజ్యం కూడా ఉందన్న కనీస అవగాహన లేకుండా కోట్లాది రూపాయలు చెల్లించారు. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా సదరు కాంట్రాక్టు సంస్థకు వంద కోట్లు ఎలా చెల్లించారని విజిలెన్స్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇందులో మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ జితేంద్రకుమార్‌ శర్మ కీలకపాత్ర పోషించినట్టు విజిలెన్స్‌ వర్గాలు చెబుతున్నాయి. కాగా, చంద్రబాబునాయుడు, లోకేశ్‌కు మెడ్‌టెక్‌ జోన్‌ సీఈఓ సన్నిహితుడిగా పేరుంది. 

అవినీతిని చూసి డైరెక్టర్ల రాజీనామా
ఇదిలా ఉంటే.. మెడ్‌టెక్‌ జోన్‌లో అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అప్పటి ఉన్నతాధికారుల రాజీనామాలే సాక్ష్యంగా చెప్పుకుంటున్నారు. ఇది ఏర్పాటైన  కొత్తలో ఐపీఎస్‌ అధికారి (నాటి ఔషధ నియంత్రణ డీజీ) డా.రవిశంకర్‌ అయ్యన్నార్, అప్పటి కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ సుజాతాశర్మలు డైరెక్టర్లుగా ఉన్నారు. డైరెక్టర్లుగా నియమితులైన కొద్ది నెలల్లోనే అక్కడ పరిస్థితులను చూసి నివ్వెరపోయిన అధికారులు.. ఉన్నతాధికారులతో తీవ్రంగా విభేదించి రాజీనామా చేశారు. ఈ ఫైళ్లపై తాము సంతకాలు చేయలేమని, తమను డైరెక్టర్లుగా తప్పించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసి మరీ తప్పుకున్నారు. వీరిరువురూ తప్పుకోక ముందే అప్పట్లో మెడ్‌టెక్‌ జోన్‌కు వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసిన జుడిష్‌ రాజును కూడా అక్రమాలపై ఫిర్యాదు చేశారనే కారణంగా తొలగించి, కేసు నమోదు చేసి జైలుకు పంపిన విషయం విదితమే.  ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఈ బాగోతం తీగలాగుతున్నారు. కాగా, మెడ్‌టెక్‌ అక్రమాలపై వారం రోజుల్లో పూర్తి సమాచారం ఇవ్వాలని విజిలెన్స్‌ అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు