జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి! 

25 Jan, 2020 05:04 IST|Sakshi
వసుంధర

కువైట్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌ మహిళల మొర 

తమను ఆదుకోవాలంటూ వాట్సాప్‌లో వీడియో మెసేజ్‌లు  

వెంటనే స్పందించిన సీఎం కార్యాలయం  

రంగంలోకి దిగిన పోలీస్‌ యంత్రాంగం.. ఇప్పటికే ఒక ఏజెంట్‌ అరెస్టు  

బాధితులను వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు  

‘‘జగనన్నా.. మాది పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం కె.సముద్రపుగట్టు గ్రామం. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్‌ లక్ష్మణరావు అక్కడి మహిళలకు మాయమాటలు చెప్పి కువైట్‌ పంపించి, అరబ్‌ షేక్‌లకు అమ్మేస్తున్నాడు. మమ్మల్ని అమ్మేసి చిత్రహింసలకు గురిచేస్తున్నారు. మా పాస్‌పోర్టులు లాక్కున్నారు. జగనన్నా.. మమ్మల్ని మీరే కాపాడాలి. ఇక్కడ కువైట్‌లోని భారత దౌత్య కార్యాలయం (ఇండియన్‌ ఎంబసీ)లో వందల మంది బాధితులు ఉన్నారు’’  
– కారెం వసుంధర అనే మహిళ శుక్రవారం వాట్సాప్‌లో పంపించిన వీడియో సందేశం  

సాక్షి ప్రతినిధి, ఏలూరు/అత్తిలి : ఉపాధి కోసం ఏజెంట్ల మాయమాటలు నమ్మి పొట్ట చేతపట్టుకుని పరాయి దేశాలకు వెళ్లిన మహిళల ఆవేదన వర్ణనాతీతంగా మారింది. పనులు ఇప్పిస్తామని నమ్మ బలికి అరబ్‌ షేక్‌లకు అమ్మేస్తున్నారని, సరిగ్గా తిండి కూడా పెట్టకుండా వెట్టిచాకిరి చేయిస్తున్నారని వారు కన్నీరు మున్నీరవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కువైట్‌ వెళ్లిన కొందరు మహిళలు అక్కడి యజమానుల బారి నుంచి తప్పించుకుని ఇండియన్‌ ఎంబసీకి చేరుకున్నారు. భారత్‌కు తిరిగి వచ్చేందుకు వారి వద్ద పాస్‌పోర్టులు కూడా లేవు. తమను కాపాడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరుతూ శుక్రవారం ఓ వీడియో సందేశాన్ని వాట్సాప్‌లో తమ బంధువులకు పంపించారు. కారెం వసుంధరతోపాటు మరికొందరు మహిళలు అందులో తమ గోడు వెళ్లబోసుకున్నారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన గుత్తుల శ్రీను అనే ఏజెంట్‌ తనను మోసం చేశాడని, తాను కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నా ఇండియా తిరిగి వెళ్లే దిక్కు లేకుండా పోయిందని మరో మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. బి.ఏటికోట గ్రామానికి చెందిన ప్రకాశ్‌రాజ్‌ అనే ఏజెంట్‌ మోసం చేసి అమ్మేశాడని కొత్తపేటకు చెందిన ఇంకో మహిళ, నెల్లూరు జిల్లా వెంకటగిరి, గుంటూరు జిల్లా రేపల్లె పట్టణాలకు చెందిన మహిళలు కూడా తమను కాపాడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) వెంటనే స్పందించింది. బాధిత మహిళలను వెనక్కి తీసుకొచ్చేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసింది. పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇరగవరం మండలం పొదలాడకు చెందిన ఏజెంట్‌ లక్ష్మణరావును అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లోని ఇండియన్‌ ఎంబసీని సంప్రదించి, బాధితులను వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.  

మరిన్ని వార్తలు