ఆ రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయి

8 Mar, 2019 08:21 IST|Sakshi
సదస్సులో మాట్లాడుతున్న కన్వీనర్‌ వెంకటరామిరెడ్డి. చిత్రంలో నాయకులు

సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎన్నో కష్టాలు పడుతున్నా ఉద్యోగ సంఘ నాయకులు మాత్రం సన్మానాలు, సంబరాలు చేసి సమస్యలన్నీ తీరినట్టు వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్‌ సంఘాల సమాఖ్య కన్వీనర్‌ వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటానికే కొత్తగా ఉద్యోగ సంఘాన్ని ఏర్పాటు చేశామని విజయవాడ ఏలూరు రోడ్డులోని ఐఎమ్‌ఏ హాల్‌లో గురువారం ఉద్యోగ సంఘ ఆవిర్భావ సమావేశంలో పేర్కొన్నారు. ఇప్పుడున్న రెండు సంఘాలు ప్రభుత్వానికి అమ్ముడుపోయాయని, వాటికి ప్రత్యామ్నాయంగా ఉద్యోగుల శ్రేయస్సే ప్రధాన అజెండాగా రాష్ట్రంలోని అన్ని సంఘాలను కలుపుకొని ఉమ్మడి పోరాటాలకు సిద్ధమయ్యామన్నారు. ఆ రెండు సంఘాలు ఎప్పుడూ ఉద్యోగుల సమస్యలపై స్పందించలేదని, రాజకీయ నాయకులకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. 

ఉద్యోగులకు 20 శాతం ఐఆర్, ఇళ్ల స్థలాలకు చెందిన రెండు జీఓలను గొప్పగా చూపే ప్రయత్నం చేస్తూ సీఎంకు సన్మానాలు చేయటం ఆక్షేపనీయమన్నారు. ఏపీ ఎన్‌జీఓ మాజీ అధ్యక్షుడు అశోక్‌బాబు ఎమ్మెల్సీ పదవికోసం ఉద్యోగుల భవిష్యత్తును తాకట్టుపెట్టారని సంఘ కో– కన్వీనర్‌ అరవపాల్‌ ఆరోపించారు. ఇప్పుడు ఉద్యోగ సంఘమనే ముసుగు తీసి తను పనిచేసిన పార్టీ కండువా కప్పుకున్నాడన్నారు. మరో సంఘ నాయకుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు కూడా అదే తోవలో పయనిస్తున్నారన్నారు.

54 సంఘాల మద్దతు
కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్‌ సంఘాల సమాఖ్యకు 54 ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయని కన్వీనర్‌ వెంకటరామిరెడ్డి తెలిపారు. సీపీఎస్‌ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయయాదవ్, వీఆర్‌ఓ సంఘం అధ్యక్షుడు ప్రసన్న కుమార్, పంచాయతీరాజ్‌ సంఘం వెంకటస్వామి, మున్సిపల్‌ ఉపాధ్యాయుల సంఘం రామకృష్ణ, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డిపార్ట్‌మెంటల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, వ్యవసాయాధికారుల సంఘం, పీఎస్‌టీయూ, గెజిటెడ్‌ ఫోరం ఉద్యోగుల సంఘం, మినిస్టీరియల్‌ స్టాఫ్‌ అసోసియేషన్, ఆల్‌ యూనివర్శిటీస్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారుల సంఘం, మార్కెట్‌ కమిటీ ఉద్యోగుల సంఘం, వాణిజ్య పన్నుల గెజిటెడ్‌ అధికారుల సంఘం, వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం, ఏపీ టీచర్స్‌ గిల్డ్, డివిజన్‌ అకౌంట్స్‌ అధికారుల సంఘం, పీఆర్‌ సైట్‌ ఇంజనీర్‌ సంఘం, నాగార్జున యూనివర్సిటీ ఎంప్లాయిస్‌ యూనియన్, హిందీ ఉపాధ్యాయుల సంఘం, పారా మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సంఘం, సహకార శాఖ గెజిటెడ్‌ అధికారుల సంఘం, ఫ్యాక్టరీల ఉద్యోగుల సంఘంతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక..
కాగా, తక్షణ కార్యకలాపాల నిమిత్తం తాత్కాలికంగా ఒక కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ కన్వీనర్‌గా వెంకటరామిరెడ్డి, కో–కన్వీనర్‌ అరవపాల్, సభ్యులుగా కమలాకర్‌శర్మ, జమాల్‌రెడ్డి, ఏవీ పటేల్, ఎం రమేష్‌కుమార్, ఖాదర్‌బాబాను ఎన్నుకున్నారు. ఉద్యోగులను మోసం చేస్తున్న నాయకుల గురించి అప్రమత్తం చేసేందుకు మార్చి 3వ వారంలో ఉద్యోగ చైతన్య యాత్ర చేపట్టాలని తీర్మానించారు. సీపీఎస్‌ రద్దు చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని.. జనవరి నుంచి 27 శాతం ఐఆర్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు