మోత

19 Jul, 2015 03:16 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, కర్నూలు: అపార్టుమెంట్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే ట్రాన్స్‌ఫార్మర్లకు తప్పనిసరిగా కెపాసిటర్లు బిగించుకోవాలని విద్యుత్‌శాఖ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి నిర్ణయాన్ని తప్పకుండా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కెపాసిటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సామర్థ్యాన్ని బట్టి సుమారు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అదనపు భారం పడనుంది. అయితే, విద్యుత్ వృథాను అరికట్టేందుకే ఈ రకమైన చర్యలను చేపడుతున్నామని విద్యుత్‌శాఖ అధికారులు పేర్కొంటున్నారు. కేవలం అపార్టుమెంట్ వాసులే కాకుండా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల ఏర్పాటును తప్పనిసరి చేయాలని విద్యుత్ శాఖ భావిస్తోంది. విద్యుత్ నష్టాలను తగ్గించడంతో పాటు సరఫరాలో హెచ్చుతగ్గులను నివారించి.. తద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు పదే పదే ట్రిప్ కాకుండా అరికట్టేందుకు కెపాసిటర్లు ఉపయోగపడతాయనేది విద్యుత్ శాఖ అధికారుల భావన. ఇందులో భాగంగా కేవలం అపార్టుమెంట్లకే కాకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ కెపాసిటర్ల వాడకాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించింది.
 
 ఈ మేరకు ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగానికి విద్యుత్‌శాఖ సూచనలు చేసింది. కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ నష్టాలు తగ్గడంతో పాటు సమర్థవంతంగా విద్యుత్‌ను ఉపయోగించుకునే వెసులుబాటు కలుగుతుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా మునిసిపాలిటీలు, పంచాయతీల ఆధ్వర్యంలోని తాగునీటి పథకాలకూ వీటిని బిగించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది. ఇందుకు అనుగుణంగా మునిసిపాలిటీలు, పంచాయతీ లుచర్యలు తీసుకోవాలని సూచించింది.
 
 వ్యవసాయ మోటార్లకూ ఏర్పాటు
 కెపాసిటర్ల వినియోగాన్ని వ్యవసాయ మోటార్లకూ తప్పనిసరి చేయాలని ఇప్పటికే విద్యుత్‌శాఖ నిర్ణయించింది. ఈ మేరకు అనుమతివ్వాలంటూ ఉన్నతాధికారులకు జిల్లా విద్యుత్‌శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు కూడా పంపింది. అయితే, కెపాసిటర్లకు అయ్యే మొత్తాన్ని రైతులు భరించుకోవాల్సి ఉంటుందా? విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లే భరిస్తాయా అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు