ఏపీసీసీ ఛీఫ్‌ మౌనదీక్ష

29 Mar, 2017 18:10 IST|Sakshi
ఏపీసీసీ ఛీఫ్‌ మౌనదీక్ష
మడకశిర: రాష్ట్రంలో ప్రస్తుతమున్నది తీవ్ర దుర్భిక్షమని పీసీసీ చీఫ్‌ ఎన్‌.రఘువీరారెడ్డి అన్నారు. ఉగాది సందర్భంగా ఆయన బుధవారం అనంతపురం జిల్లా మడకశిరలోని గాంధీజీ విగ్రహం వద్ద మౌనదీక్ష చేపట్టారు. ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు దీక్ష సాగింది. తొలుత స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోని గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. దీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు, దేశ వ్యాప్తంగా లౌకికవాదానికి ముప్పు, రైతు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికి ఈ దీక్ష చేపట్టానన్నారు. 

ఎన్డీఏ ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో మైనార్టీలకు భద్రత కరువైందన్నారు. హిందువులకు కూడా శాంతి లేదన్నారు. రాష్ట్రంలో 6.50 లక్షల టన్నుల పశుగ్రాసం కొరత ఉందని ఆయన తెలిపారు. ఐదు వేల గ్రామాల్లో తాగునీటి సమస్య ఉన్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 12 లక్షల మంది కూలీల హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ధ్వజమెత్తారు. యంత్రాలతో ఉపాధి పనులను చేపడుతుండటంతో కూలీల వలసలు పెరిగాయన్నారు.

గతేడాది రాష్ట్రంలో 580 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వీరి కుటుంబాలకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. హేవళంబి సంవత్సరంలో రాష్ట్ర ప్రజలను పాలకులు పెద్దఎత్తున మోసం చేస్తారని పంచాంగం చెబుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ దీక్షలో మాజీ ఎమ్మెల్యే కె.సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ చేవూరు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 
 
మరిన్ని వార్తలు