'కళాకారులకు లోకేష్‌ క్షమాపణ చెప్పాలి'

21 Nov, 2017 16:28 IST|Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల‌పై ఎన్న‌డూ లేనంత‌గా విమ‌ర్శ‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. విమర్శలపై స్పందించిన మంత్రి లోకేష్‌ నంది అవార్డుల వివాదం మరింత ముదిరితే అవార్డులను రద్దు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. నాన్‌ రెసిడెన్షియల్స్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు లేనివారని అవార్డులపై మాట్లాడుతున్నారన్నారు. కాగా లోకేష్‌ వ్యాఖ్యలను ఏపీసీసీ తప్పుబట్టింది. లోకేష్‌ వెంటనే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతం డిమాండ్‌ చేశారు. 

నంది అవార్డులకు కులం ఆపాదించవద్దంటూనే.. కళాకారులకు ప్రాంతాలు ఆపాదించే పనికి లోకేష్‌ పూనుకున్నారని విమర్శించారు. ప్రభుత్వం నియమించిన కమిటీలోని సభ్యులను రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డులు చూసి నియమించారా? రెసిడెన్షియల్‌ చూసే నటులకు అవార్డులు ఇచ్చారా? ఎక్కువ నంది అవార్డులు వచ్చిన బాలకృష్ణ రెసిడెన్స్‌ ఎక్కడ ఉంది? అనే ప్రశ్నలకు ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ ప్రమేయంతో నంది అవార్డుల ఎంపిక జరిగిందనే ఆరోపణలు వచ్చినందున వెంటనే ప్రకటించిన అవార్డులను రద్దు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు