పేదలపై భారం లేకుండా..

11 Feb, 2020 09:22 IST|Sakshi

2020–21 విద్యుత్‌ చార్జీలు ప్రకటించిన ఏపీఈఆర్‌సీ

లోటు భారం అంతా ప్రభుత్వం మీదే

1.45 కోట్ల మందికి నయాపైసా పెంపులేదు

1.43 లక్షల మందికే స్వల్పంగా పెంపు

500 యూనిట్లపైన యూనిట్‌కు 90పైసలు పెంపు

డిస్కమ్‌లకు రూ.10 వేల కోట్లకు పైగా ప్రభుత్వ సబ్సిడీ

టీడీపీ హయాంలో వినియోగదారులపై 2,178 కోట్ల ప్రత్యక్ష భారం.. దొడ్డిదారిన మరో రూ.3 వేల కోట్లు భారం  

సాక్షి, అమరావతి: ప్రజలపై ఏమాత్రం విద్యుత్‌ ఛార్జీల భారం వేయకుండా.. పెంచాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తూ.. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) 2020–21 సంవత్సరానికి గాను కొత్త విద్యుత్‌ చార్జీలను సోమవారం ప్రకటించింది. సవరించిన టారిఫ్‌ ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుంది. హైదరాబాద్‌లోని ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో నియంత్రణ మండలి చైర్మన్‌ జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, సభ్యులు పి.రఘు, రామ్మోహన్‌ కొత్త టారిఫ్‌ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 99 శాతం విద్యుత్‌ వినియోగదారులపై ఏమాత్రం భారం పడకుండా, విద్యుత్‌ పంపిణీ సంస్థలకు నష్టం వాటిల్లకుండా టారిఫ్‌ను రూపొందించామన్నారు. డిస్కమ్‌ల ప్రతిపాదనలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో వ్యక్తమైన అంశాలకే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చామని ఆయన తెలిపారు.  

విద్యుత్‌ చార్జీల రూపంలో ప్రజలపై పడాల్సిన భారాన్నంతా సర్కారే భరిస్తోంది. ప్రభుత్వం డిస్కమ్‌లకు ఉదారంగా పెద్దఎత్తున సబ్సిడీ ఇవ్వడంవల్లే పేదలపై భారం పడలేదని నాగార్జునరెడ్డి తెలిపారు. డిస్కమ్‌లు తమ వార్షిక ఆదాయ అవసరాలను రూ.14,349.07 కోట్లుగా చూపించాయని, దీన్ని కమిషన్‌ మదించి రూ.12,954.11 కోట్లుగా తేల్చిందన్నారు. ఇందులో రూ.2,893.48 కోట్ల మేర వివిధ రూపాల్లో డిస్కమ్‌లు సమకూర్చుకునేలా అవకాశం కల్పించామన్నారు. మిగిలిన రూ.10,060.63 కోట్లలో.. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ కోసం రూ.8,353.58 కోట్లు.. ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చినట్లు తెలిపారు. గత ఏడాది ప్రకటించిన సబ్సిడీ (రూ.7,064.27)తో పోలిస్తే ఇది 18 శాతం ఎక్కువని ఆయనన్నారు. అలాగే, రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా గృహ విద్యుత్‌ వినియోగదారుల తరఫున రూ.1,707.07 కోట్లు సబ్సిడీ ఇవ్వడంవల్ల పేదలపై ఏమాత్రం భారం పడకుండా టారిఫ్‌ ఇవ్వగలిగినట్లు నాగార్జునరెడ్డి వెల్లడించారు. (చదవండి: వ్యవ'సాయం'.. విప్లవాత్మకం)


జిమ్మిక్కులు.. దొడ్డిదారి వడ్డనకు స్వస్తి
► గత టీడీపీ ప్రభుత్వం అనేక దొడ్డిదారి మార్గాల్లో విద్యుత్‌ ఛార్జీల భారం ప్రజలపై మోపింది. ఇందులో శ్లాబుల వర్గీకరణ ఒకటి. గత ఏడాది వినియోగాన్ని కొలమానంగా తీసుకుని ప్రస్తుత సంవత్సరంలో అత్యధిక విద్యుత్‌ భారం మోపేవారు. ఉదా.. గత ఏడాది విద్యుత్‌ వినియోగం 600 దాటి 601కి చేరితే.. ప్రస్తుత విద్యుత్‌ టారిఫ్‌లో 0–50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 బదులు రూ.2.60 వసూలు చేసేవారు. ఇలాంటి పరోక్ష పద్ధతులకు ప్రస్తుత కమిషన్‌ స్వస్తి పలికింది.  

►అలాగే, సంపన్న వర్గాలకు (500 యూనిట్లు దాటితే) యూనిట్‌కు కేవలం 90 పైసలు పెంచింది. (రూ.9.05 నుంచి 9.95 చేసింది). ఇలాంటి వారు రాష్ట్రంలో 1,43,65,000 మంది ఉన్నారు. ఈ పెంపువల్ల వచ్చే ఆదాయం గరిష్టంగా రూ.50 కోట్లు మాత్రమే. అంటే.. 1.45 కోట్ల మందిపై పైసా కూడా భారం పడదు.
పరిశ్రమలకు ఫుల్‌ పవర్‌
ఏపీలో పారిశ్రామికాభివృద్ధే లక్ష్యంగా విద్యుత్‌ టారిఫ్‌లో ఆ రంగానికి పెద్దపీట వేశారు. విద్యుత్‌ బిల్లుల భారం పడకుండా సమతుల్యం పాటించడం విశేషం. ఎలాగంటే..  
► లాభాపేక్ష లేని ప్రభుత్వ విద్యాలయాలు, ఆసుపత్రులను వాణిజ్య కేటగిరీ నుంచి హెచ్‌టీలోని సాధారణ కేటగిరీలో చేర్చారు. దీనివల్ల టైమ్‌ ఆఫ్‌ డే (పీక్‌.. నాన్‌ పీక్‌ అవర్స్‌లో వేర్వేరు ధరలు) ధరల నుంచి తప్పించారు.  
► దోభీఘాట్‌లకు ఉచిత విద్యుత్‌ కొనసాగుతుంది.
► రైల్వేలకు వర్తించే ధరలను యూనిట్‌కు రూ.6.50 చొప్పున డిస్కమ్‌లు ప్రతిపాదిస్తే.. కమిషన్‌ దాన్ని రూ.5.50కు పరిమితంచేసింది.  
► విద్యుత్‌ వాహనాల యూనిట్‌ ప్రతిపాదిత ధరను రూ.12.25 నుంచి రూ. 6.70కి తగ్గించారు.  
► అత్యధికంగా విద్యుత్‌ వాడకం ఉండే పరిశ్రమలకు రాయితీలుంటాయి. రైస్, పల్వరైజింగ్‌ మిల్లుల లోడ్‌ను 100 హెచ్‌పి నుంచి 150 హెచ్‌పికి పెంచారు. పరిశ్రమల్లో కాంట్రాక్టు డిమాండ్‌ కన్నా ఎక్కువ లోడ్‌ ఉంటే వేసే అపరాధ రుసుము ప్రతిపాదనలను కమిషన్‌ తిరస్కరించింది. కెపాసిటర్‌ సర్‌ ఛార్జీలను 25 శాతం నుంచి 10 శాతానికి తగ్గించడంవల్ల చిన్న తరహా వినియోగదారులకు ఊరట కల్పించారు.  
► 5 కోట్లకు మించి ఏ పనులు చేపట్టాలన్నా ట్రాన్స్‌కో, డిస్కమ్‌లు ఇక మీదట ఏపీఈఆర్‌సీ అనుమతి తీసుకోవాల్సిందే.  
► వ్యవసాయ భూముల్లో విద్యుత్‌ లైన్లు వేసేప్పుడు పరిహారం తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.  
► చివరగా.. ప్రైవేటు విద్యుత్‌ సంస్థల నుంచి కొత్తగా పీపీఏలు చేసుకునే డిస్కమ్‌ల ప్రతిపాదనను ఏపీపీఆర్‌సీ తిరస్కరించింది.  

ఐదేళ్లుగా బాదుడే బాదుడు..
2004 నుంచి 2009 వరకూ సీఎంగా ఉన్న వైఎస్సార్‌ హయాంలో విద్యుత్‌ ఛార్జీలు ఒక్కపైసా పెరగలేదు. అంతకుముందు 2003 వరకూ రైతులపై ఉన్న విద్యుత్‌ బకాయిలను కూడా వైఎస్‌ సర్కార్‌ రద్దు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. మూడుసార్లు ప్రత్యక్షంగా విద్యుత్‌ ఛార్జీలు పెంచింది. ఈ భారం రూ.2,178 కోట్లు. ఇది కాకుండా శ్లాబుల వర్గీకరణ, డిమాండ్‌ ఛార్జీల పేరుతో సాధారణ వినియోగదారులపైనే కాదు.. పరిశ్రమలపైనా పెద్దఎత్తున పరోక్షంగా విద్యుత్‌ భారం మోపింది. ఇది దాదాపు రూ.3 వేల కోట్లకు పైగా ఉంటుంది. వెరసి ఐదేళ్ల టీడీపీ పాలనలో ప్రజలపై పడిన విద్యుత్‌ ఛార్జీల భారం రూ.5వేల కోట్లపైనే. కానీ, వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఒక్కపైసా పేదలపై భారం పడకుండా విద్యుత్‌ టారిఫ్‌ ప్రకటించడం విశేషం.

మరిన్ని వార్తలు