నెలలోగా అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ 

10 Jun, 2020 03:33 IST|Sakshi

ఇరు రాష్ట్రాలతో చర్చించి అజెండాను సిద్ధంచేయండి 

వర్కింగ్‌ మాన్యువల్‌ ఖరారుకూ చర్యలు 

కృష్ణా, గోదావరి బోర్డు చైర్మన్లకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి షెకావత్‌ దిశానిర్దేశం 

సాక్షి, అమరావతి: కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టుల విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు నెలలోగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించి.. అజెండాను సిద్ధంచేయాలని కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఆ తర్వాత ఇరు రాష్ట్రాల సీఎంలతో అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీని నిర్వహించి.. వివాదాలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

ఈ రెండు బోర్డుల చైర్మన్లు ఎ.పరమేశం, చంద్రశేఖర్‌ అయ్యర్‌లతో మంత్రి షెకావత్‌ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్, కొత్త ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాల పరస్పర ఫిర్యాదులు, అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశానికి అజెండాను పంపాలని ఇరు రాష్ట్రాలను కోరామని.. కానీ, ఇప్పటిదాకా అవి స్పందించలేదని మంత్రికి బోర్డుల చైర్మన్లు వివరించారు. దీనిపై షెకావత్‌ స్పందిస్తూ.. వారంలోగా అపెక్స్‌ కౌన్సిల్‌కు అజెండా పంపాలని కోరుతూ మరోసారి రెండు రాష్ట్రాలకు లేఖలు రాయాలని, అప్పటికీ స్పందించకపోతే ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాల్లో చర్చించిన అంశాల ఆధారంగా అజెండా ఖరారుచేసి పంపాలని బోర్డుల చైర్మన్లను ఆదేశించారు. అలాగే, రెండు బోర్డుల పరిధి, వర్కింగ్‌ మాన్యువల్‌నూ ఖరారు చేస్తామన్నారు. అజెండాను పంపితే.. ఇరు రాష్ట్రాల సీఎంలతో చర్చించి నెలలోగా అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహిస్తామని మంత్రి షెకావత్‌ చెప్పినట్లు బోర్డు వర్గాలు తెలిపాయి.    

మరిన్ని వార్తలు