కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం‍ అవాస్తవం

7 Aug, 2019 17:06 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తోన్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తారనే ప్రచారం‍లో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షడు రామసూర్యనారయణ తెలిపారు. ఈ విషయంలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఈరోజు ప్రభుత్వ ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు గ్రామ సచివాలయంలో పరిపాలన సౌలభ్యం కోసమే. ఈ పోస్టులకు అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి ఈ పరీక్షల్లో 10 శాతం వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. ఒకవేళ వారు పరీక్షల్లో ఉత్తీర్ణత కాకపోయినా వారిని ఉద్యోగాల్లో నుంచి తీసివేయరు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఒక్క ఉద్యోగిని కూడా తొలగించడం జరగదు. అర్హత కలిగిన ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని కోరాం. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్‌లో జరిగిన తప్పిదం వల్లే ఈ గందరగోళం నెలకొంది. గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షలో నెగిటివ్ మార్కుల విధానాన్ని రద్దు చేయాలని అడిగాం. దీనిపై అధికారులు సానుకూలంగా స్పందించారని’ వెల్లడించారు. 

మరిన్ని వార్తలు