బొగ్గులో ‘రివర్స్‌’

12 Oct, 2019 04:17 IST|Sakshi

164కోట్లకు పైనే ఆదా

రవాణా ఖర్చులో ఖజానాకు భారీగా మిగులు

టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనల సడలింపు

గతంలో ఎల్‌–1 ధర టన్నుకు .. రూ. 1,370

రివర్స్‌ టెండరింగ్‌తో మారిన ధర టన్నుకు.. రూ. 1,146

మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి కృష్ణపట్నం విద్యుత్‌ ప్లాంట్‌కు రవాణా అయ్యే బొగ్గు.. 36,75,000 మెట్రిక్‌ టన్నులు

ఏటా ఆదా రూ. 82.32 కోట్లు

రెండేళ్లకు ఆదా రూ. 164.64 కోట్లు

సాక్షి, అమరావతి: ప్రజాధనాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రివర్స్‌ టెండరింగ్‌ మరోసారి విజయవంతమైంది. ఈ విధానంలో ఏపీ జెన్‌కో మునుపెన్నడూ లేని విధంగా తక్కువ ధరకు బొగ్గు రవాణా కాంట్రాక్టులను ఖరారు చేసింది. రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టి ఎల్‌–1 ధర కన్నా తక్కువ రేటుకు వచ్చేలా చేసింది. దీనివల్ల రూ.164.647 కోట్ల ప్రజాధనం ఆదా కానుంది.  రాష్ట్ర ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇది నిదర్శనమని విద్యుత్‌ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సాంకేతిక అర్హత సాధించినవి 7 కంపెనీలు..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 1,600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (కృష్ణపట్నం) కోసం ఏటా 3.675 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల బొగ్గు రవాణాకు సంబంధించి ఏపీ విద్యుత్‌ అభివృద్ధి సంస్థ (ఏపీపీడీసీఎల్‌) సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. ఒడిశాలోని తాల్చేరు బొగ్గు క్షేత్రం నుంచి సమీపంలోని శుద్ధి చేసే ప్రాంతాలకు బొగ్గును చేరుస్తారు. అక్కడ శుద్ధి చేసిన (వాష్డ్‌ కోల్‌) బొగ్గును జల రవాణా ద్వారా కృష్ణపట్నం పోర్టుకు చేరవేస్తారు.

ఈ టెండర్‌ దక్కించుకునేందుకు ఏడు కంపెనీలు సాంకేతిక అర్హత సాధించాయి. ఇందులో ముంబైకి చెందిన ఎంబీజీ కమొడిటీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ టన్నుకు రూ.1,370.01 ధర కోట్‌ చేసి ఎల్‌–1గా నిలిచింది. అధికారులు ఈ ధరను కోట్‌ చేస్తూ రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టగా చెన్నైకి చెందిన చిట్టినాడ్‌ లాజిస్టిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అతి తక్కువగా మెట్రిక్‌ టన్నుకు రూ.1,146 ధర కోట్‌ చేసి బొగ్గు రవాణా కాంట్రాక్టును దక్కించుకుంది.

గతంలో ఆరోపణలు..
గత ఐదేళ్లుగా బొగ్గు రవాణా కాంట్రాక్టుల వ్యవహారంలో పలు  ఆరోపణలు వచ్చాయి. బొగ్గు కుంభకోణాలపై ‘సాక్షి’ దినపత్రిక ఆధారాలతో సహా అనేక కథనాలు ప్రచురించింది. సీఎం వైఎస్‌ జగన్‌ విపక్ష నేతగా ఉన్నప్పుడు ఈ అంశాన్ని అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. టీడీపీ నేతల కనుసన్నల్లో టెండర్‌ డాక్యుమెంట్లు రూపొందించిన వైనం విద్యుత్‌ వర్గాలనే కలవర పెట్టింది. ముడుపులు ఇచ్చిన వారికే కాంట్రాక్టులు దక్కేలా, అతి తక్కువ మంది టెండర్లలో పాల్గొనేలా ఏపీజెన్‌కోతో టెండర్‌ నిబంధనలు రూపొందించేలా చేశారు.

నేడు పారదర్శకతే ప్రామాణికం
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన రివర్స్‌ టెండర్లలో ఎక్కువ మంది పాల్గొనేలా నిబంధనలు పొందుపరిచారు. ఒకరికన్నా ఎక్కువ మంది కలిసి బొగ్గు రవాణా కాంట్రాక్టు చేపట్టవచ్చనే వెసులుబాటూ ఇచ్చారు. ఫలితంగా కాంట్రాక్టుల కోసం పలువురు పోటీ పడ్డారు. గత నెల 30వ తేదీన బిడ్స్‌ ఓపెన్‌ చేశారు. అదాని ఎంటర్‌ప్రైజెస్‌ (గుర్గామ్‌), ఆనంద్‌ ట్రాన్స్‌పోర్ట్‌ లిమిటెడ్‌ (చెన్నై), శరత్‌ చటర్జీ అండ్‌ కో (విశాఖ), చిట్టినాడ్‌ లాజిస్టిక్స్‌ (చెన్నై), గ్లోబల్‌ కోల్‌ మైనింగ్‌ (న్యూఢిల్లీ), కరమ్‌ చంద్‌ తప్పర్, ట్రైడెంట్‌ (కన్సార్టియం–హైదరాబాద్‌), ఎంబీజీ కమొడిటీస్‌ (హైదరాబాద్‌)తో కలిసి ఎలిగెంట్‌ లాజిస్టిక్స్‌ కన్సార్టియంగా ఫైనాన్షియల్‌ అర్హత పొందాయి. ఎల్‌–1 ధరతో ఈ నెల 10వ తేదీన రివర్స్‌ బిడ్డింగ్‌ నిర్వహించారు. చిట్టినాడ్‌ మెట్రిక్‌ టన్ను రూ.1,146 ధరకు ప్లాంట్‌కు బొగ్గు చేరవేసేందుకు ముందుకొచ్చింది. ఈ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చారు.

ప్రజాధనం ఆదా అమోఘం
గత ప్రభుత్వ హయాంలో బొగ్గు రవాణా కాంట్రాక్టు టన్నుకు రూ.1,240 చొప్పున ఇవ్వగా ప్రస్తుతం ఇచ్చిన కాంట్రాక్టు టన్నుకు రూ.1,146 మాత్రమే కావడం గమనార్హం. అంటే గతంలో కంటే ఈసారి టన్నుకు రూ.100 చొప్పున తక్కువ ధరకు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌కు ఏటా 36,75,000 మెట్రిక్‌ టన్నుల బొగ్గు మహానది కోల్‌ ఫీల్డ్స్‌ నుంచి రవాణా అవుతుంది. ఈ కాంట్రాక్టులో ఎల్‌–1 ధర టన్నుకు రూ.1,370.01 కాగా రివర్స్‌ టెండరింగ్‌ వల్ల ఇది రూ.1,146కి వచ్చింది. అంటే మెట్రిక్‌ టన్నుకు రూ.224.01 చొప్పున తగ్గింది. ఈ క్రమంలో ఏటా రవాణా చేసే 36,75,000 మెట్రిక్‌ టన్నుల బొగ్గులో రూ.82.32 కోట్లు ఆదా కానుంది. తద్వారా రెండేళ్ల కాంట్రాక్టు గడువులో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా మొత్తం రూ.164.647 కోట్లు ఆదా అవుతుంది.

జెన్‌కో చరిత్రలో ప్రథమం
వివాదాలకు తావులేకుండా, పారదర్శకంగా బొగ్గు రవాణా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడం జెన్‌కో చరిత్రలో ఇదే ప్ర«థమం. ఎక్కువ మంది పాల్గొనేలా జాగ్రత్తలు తీసుకున్నాం. రివర్స్‌ టెండరింగ్‌ విధానం జెన్‌కో వర్గాల్లో ఆత్మస్థైర్యాన్ని నింపుతోంది. ప్రజాధనం వృధా కాకుండా కాపాడామన్న సంతృప్తి కలుగుతోంది. ఇక ముందు కూడా ప్రతి టెండర్లను ఇదే విధంగా నిర్వహిస్తాం. కాంట్రాక్టర్ల మధ్య
పోటీతో నాణ్యమైన సేవలు అందుతాయి.
 – శ్రీధర్‌ (జెన్‌కో ఎండీ)


 

>
మరిన్ని వార్తలు