రూల్స్‌లో ఆర్‌బీఐని మించిన ఏపీజీవీబీ

25 Nov, 2016 23:41 IST|Sakshi
రూల్స్‌లో ఆర్‌బీఐని మించిన ఏపీజీవీబీ

విశాఖ: గ్రామీణ వికాస్ బ్యాంకు తన ఖాతాదారులకు చుక్కలు చూపిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) షరతులతో సమానంగా ఏపీ జీవీబీ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టడంతో ఖాతాదారుల కష్టాలు రెట్టింపయ్యాయి. రూ.2.5 లక్షలు విత్ డ్రా చేయాలంటే ఖాతాదారుడికి గంపెడు కష్టాలు తప్పడం లేదు. కూతురి పెళ్లికోసం డబ్బులు విత్ డ్రా చేసేందుకు వెళ్లిన ఓ తండ్రికి బ్యాంకు ఉద్యోగులు షాకిచ్చారు. జిల్లాలోని భీమిలి మండలం లక్ష్మీపురం గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు కొత్త రూల్స్ ప్రవేశపెట్టారు. పెళ్లి బ్యాండ్, లైటింగ్, కళ్యాణ మండపం వంటి చెల్లింపులకు సంబంధించి తమకు బిల్లులు సమర్పించాలని కొత్త నిబంధనల్లో పేర్కొంది.

రశీదులు సమర్పించని పక్షంలో బ్యాంక్ అకౌంట్ లేదని డిక్లరేషన్ ఇవ్వాలని సిబ్బంది చెప్పడంతో ఓ వధువు తండ్రి రమణ షాక్ తిన్నారు. గత జూలైలో భార్య, కూతురి పేర్లపై రమణ రూ.5లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశాడు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఆయనకు సమస్యలు పెరిగిపోయాయి. గత 15 రోజులుగా బ్యాంకు చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా డబ్బులకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తంచేశాడు. వచ్చే నెల 4న తన కూతురి వివాహం చేస్తున్నామని, కానీ డబ్బులు ఉన్నా అవి బ్యాంకు నుంచి చేతికి రాక రమణతో పాటు ఆయన కుటుంబసభ్యులు అయోమయంలో ఉన్నారు. ఈ సమస్య కేవలం రమణ కుటుంబంలోనే కాదు దేశంలో చాలా కుటుంబాలు పెద్ద నోట్ల రద్దు వల్ల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా పెళ్లిళ్లు వాయిదాలు వేసుకుంటున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు