ఏపీఐఐసీ చైర్మన్ ‘దొనకొండ’ పరిశీలన

14 Nov, 2014 02:59 IST|Sakshi

దొనకొండ : దొనకొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను రాష్ట్ర పరిశ్రమల సంస్థ (ఏపీఐఐసీ) చైర్మన్ కృష్ణయ్య బృందం గురువారం పరిశీలించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశ్రమల శాఖ ఆదేశాల మేరకు తాము దొనకొండ ప్రాంతంలోని ప్రభుత్వ భూములను పరిశీలించేందుకు విచ్చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు అనుకూలమని పేర్కొన్నారు.

రుద్రసముద్రం, భూమనపల్లి, మంగినపూడి, ఇండ్లచెరువు, పోచమక్కపల్లి ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించి, తహశీల్దార్ కేవీ సత్యనారాయణను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మ్యాప్‌లను పరిశీలించారు. అనంతరం స్థానిక రైల్వే గెస్ట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దొనకొండ ధనకొండగా అభివృద్ధి చెందుతుందన్నారు.

 ఇక్కడి భూముల పరిస్థితి, సౌకర్యాల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామన్నారు. దొనకొండ నుంచి కర్నూలు-గుంటూరు హైవే, దొనకొండ నుంచి అద్దంకి మీదుగా నార్కెట్‌పల్లి హైవే మార్గాలను కలుపుకుంటే రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని చెప్పా రు. ఆయన వెంట ఏపీఐఐసీ నెల్లూరు జనరల్ మేనేజర్ వి.నాగేశ్వరరావు, ఏపీఐఐసీ డిప్యూటీ మేనేజర్ ఎన్.వీరశేఖరరెడ్డి, ఒంగోలు ఏపీఐఐసీ మేనేజర్ బీఎన్.అవధాని తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు