మా ఉద్యోగుల జోలికి రావొద్దు: అశోక్‌బాబుపై ధ్వజం

6 Apr, 2020 16:47 IST|Sakshi

సాక్షి, అమరావతి:  విశ్రాంత ఉద్యోగస్తులకు 100 శాతం పెన్షన్ చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆంధ్రప్రదేశ్‌ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు. కరోనా వైరస్‌పై పోరాటంలో కింది స్థాయి ఉద్యోగుల కష్టాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని పేర్కొన్నారు. ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దని.. కరోనాపై పోరులో ఇంటికి వెళ్లకుండా కష్టపడుతున్న ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి గుర్తించారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందుల కారణంగానే ఉద్యోగులకు 50 శాతం జీతాలు చెల్లించారని... మిగిలిన 50 శాతం గురించి ప్రభుత్వాన్ని కోరతామని తెలిపారు. 

ఇక ఉద్యోగులను అడ్డుగా చూపించి పదవి సంపాదించిన చరిత్ర గల టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఒక్కరోజు నిరాహార దీక్ష చేయడం విడ్డూరంగా ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. ఉద్యోగుల కోసం ఇప్పుడు దీక్ష చేసేంత అవసరం ఆయనకు ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఆయన నిరాహార దీక్ష రాజకీయ కుట్రలో భాగమేనని మండిపడ్డారు. గతంలో ఉద్యోగుల జీవితాన్ని తాకట్టు పెట్టిన ఆయన తమ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉద్యోగ సంఘంలో ఉన్నప్పుడు చేయని దీక్షలు అశోక్‌బాబు ఇప్పుడెందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తమను కదిలిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలను బయటపెడతామని.. ఉద్యోగుల జోలికి రావొద్దని హెచ్చరించారు. (కరోనాపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష)

‘‘ఉద్యోగ‌ సంఘాల మీద రాజకీయ ముద్ర వేసిన చరిత్ర నీది. మా ‌ఉద్యోగులకు ఏం కావాలో మాకు తెలుసు... మాకు నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. నీ వలన ఉద్యోగస్తులమంతా ఇప్పుడు బాధ పడుతున్నాం . మీ రాజకీయం మీరు చేసుకోండి.. మేం మీ జోలికిరాము. వాళ్ల నాన్న చనిపోతే అశోక్‌బాబు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఇంటర్మీడియట్ చదవిన వారికి జూనియర్ అసిస్టెంట్ ఇవ్వమని మేము పోరాడుతుంటే.. డిగ్రీ వాళ్ల కు ఇవ్వమని అడిగిన వ్యక్తి అశోక్ బాబు. 50 శాతం జీతాలు రాకుండా అడ్డుకొవాలని అశోక్ బాబు కుట్ర పన్నుతున్నట్లు అనిపిస్తుంది. ఏపీఎన్జీవో  ఉద్యోగ సంఘ నాయకులు పై రాజకీయ ముద్ర పడేలా చేసిన చరిత్ర అశోక్ బాబుది’’ అని అశోక్‌బాబు తీరును బొప్పరాజు వెంకటేశ్వర్లు దుయ్యబట్టారు.(కార్మికుల కాళ్లు కడిగిన ఎమ్మెల్యే  )

ఆ ఘనత సీఎం జగన్‌ సొంతం
‘‘ఉద్యోగులు అడగకుండానే 27% ఐఆర్ ఇచ్చిన ఘనత సీఎం జగన్‌ సొంతం. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేసిన చరిత్ర ఈ ప్రభుత్వానిది. క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య కార్మికులకు మూడు వేల రూపాయల నుంచి 10 వేలు జీతాలు పెంచిన ఘనత సీఎం జగన్‌కు దక్కింది. అయితే కొంతమంది పారిశుద్య, కార్మికులు, ఏఎన్ఎంలతో ధర్నాలు చేయించి రాజకీయం చేయాలని చూస్తున్నారు. పనిచేసే వాడికి ఎస్మా గురించి అవసరమేముంది. పనిచేయని వాడే ఎస్మా గురించి భయపడతారు. ఇంకా కొన్ని రోజులు కష్టపడండి... కరోనా‌ మహమ్మారిని తరిమికొట్టేందుకు మరింత కష్టపడి ప్రజలను రక్షిద్దాం’’ అని ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ‘‘అశోక్ బాబు రాజకీయాలు మీ చేసుకోండి, మా ఉద్యోగుల సంక్షేమం మేము చూసుకుంటాం’’ అని చురకలు అంటించారు.

మరిన్ని వార్తలు