ఏపీఎంపై దాడిచేసినవారి అరెస్ట్‌కు డిమాండ్

30 Jan, 2014 01:51 IST|Sakshi
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ నెల 25న పొందూరు ఐకేపీ ఏపీఎం సవర వెంకట్రావుపై దాడి చేసినవారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని ఐకేపీ ఉద్యోగులు బుధవారం ఆందోళనకు దిగారు. తొలుత ఎన్‌టీఆర్ మున్సిపల్ ఉన్నత పాఠశాల మైదానంలో సమావేశమయ్యారు.వైఎస్‌ఆర్ కూడలిలో మానవహారం నిర్వహించారు. అక్కడ్నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టర్ సౌరభ్ గౌర్ అందుబాటులో లేకపోవటంతో ఏజేసీ ఆర్.ఎస్.రాజకుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఐకేపీ ఉద్యోగుల సంఘం ప్రనినిధులు వెంకట్రావు, వైకుంఠరావులు మాట్లాడుతూ 25న జెడ్పీ సమావేశ మందిరంలో అధికారులు, ప్రజల సమక్షంలో ఏపీఎం సవర వెంకట్రావుపై నందివాడ గ్రామ సర్పంచ్ గోపాలకృష్ణ, అతని అనుచరులు అమానుషంగా దాడి చేశారని ఆరోపించారు. 
 
 పజల పక్షాన పనిచేస్తున్న ఉద్యోగులపై సర్పంచ్ రాజకీయ అండదండలతో దాడులు చేస్తున్నారన్నారు. అధికారుల సమక్షంలోనే దాడి జరిగినా రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. మండల స్థాయి ఉద్యోగులకే రక్షణ లేకపోతే గ్రామాల్లోని ఉద్యోగుల పరిస్థితేంటని ప్రశ్నించారు. గతంలో ఎచ్చెర్ల, వీరఘట్టం తదితర ప్రాంతాల్లో మండల మహిళా సమాఖ్యల ఎన్నికల్లోనూ ఐకెపీ సిబ్బందిపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏసీలు, డీపీఎంలు నారాయణరావు, రాజ్‌కుమార్, జి.నారాయణరావు, రాజారావు, ఏపీఎంలు, సీసీలు, సీవీలు, వీఏవోలు, ఎన్‌పీఎం సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు