ఏపీఎంఎస్‌ఐడీసీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

19 Jun, 2017 20:16 IST|Sakshi
ఏపీఎంఎస్‌ఐడీసీ రాష్ట్ర కార్యాలయం ప్రారంభం

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్‌ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) రాష్ట్ర ప్రధాన కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ కామినేని శ్రీనివాస్‌ సోమవారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆటోనగర్‌లో దీనిని నూతనంగా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాసుపత్రులకు మౌలిక వసతుల కల్పనలో ఏపీఎంఎస్‌ఐడీసీ కీలక పాత్ర వహిస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులను అత్యాధునికంగా తీర్చిదిద్ది అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేసి పేదలకు తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యసేవలు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు.

రూ.128 కోట్లతో రాష్ట్రంలోని 250 ఆసుపత్రులలో మౌలిక వసతుల కల్పించడంతో పాటు ప్రతి ఆసుపత్రిలోను పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రభుత్వాసుపత్రులలో వైద్యుల కొరతను అధిగమించేందుకు త్వరలో 828 మంది డాక్టర్లను నియమిస్తున్నామని తెలిపారు. 301 మందిని ఏపీపీఎస్సీ ద్వారా తీసుకుంటున్నామని, మరో 527 మంది డాక్టర్లను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుని ప్రతి ఆసుపత్రిలో డాక్టర్లను నియమిస్తామని వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వైద్యపరంగా ఎంతో నష్టపోయామన్నారు. అన్ని భవనాలను హైదరాబాద్‌లోనే వదిలేయాల్సి వస్తోందని తెలిపారు. హైదరాబాద్‌ ఎలా మెడికల్‌ హబ్‌గా ఉందో రాబోయేకాలంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలతో పాటు రాజధాని అమరావతిలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులతో రాష్ట్రాన్ని మెడికల్‌ హబ్‌గా చేస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు