ఆ తోటల్లో...

16 Apr, 2018 09:52 IST|Sakshi
నేరాలకు నిలయంగా మారిన అప్పనదొరపాలెం తోటల ప్రాంతం (ఇన్‌సెట్‌) హత్యకు గురైన మహిళ (ఫైల్‌) 

విస్తరిస్తున్న నేర సామ్రాజ్యం

అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా అప్పనదొరపాలెం తోటలు

చీకటి పడితే చట్ట వ్యతిరేక పనులు

దృష్టి పెట్టని పోలీసులు

నర్సీపట్నం : నర్సీపట్నానికి కూత వేటు దూరం.... విశాఖ వెళ్లే దారిలో రెండు కిలోమీటర్ల దూరంలో అప్పన్నదొరపాలెం తోటలు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా మారాయి. చీకటి పడితే చాలు అసాంఘిక కార్యకలాపాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. 

చీకటి కార్యకలాపాలకు అనువుగా...
సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో జీడిమామిడి, సరుగుడు తోటలు ఉన్నాయి. అందువల్ల చీకటి కార్యకలాపాలకు అనువుగా మారాయి. ఇక్కడికి మోటార్‌ సైకిళ్లపై వచ్చి కార్యకలాపాలు ముగించుకుని వెళ్తుంటారు. పాత నేరస్తులు కూడా వస్తుంటారు.  యువతులను తీసుకువచ్చి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.  వారి మధ్య గొడవలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.

హత్యకు దారి తీసిన సందర్భాలు..: పరిస్థితి విషమిస్తే హత్యలకు దారితీసిన పరిస్థితులు లేకపోలేదు. విశాఖ నగరంలో చంపేసిన వారిని సైతం ఇక్కడికి తీసుకువచ్చి పడేస్తుంటారు.  ఇదే తోటలో ఏడాది క్రితం ఒక యువకుడు హత్యకు గురయ్యాడు. మరో రెండు మూడు నెలలు గడిచిన తరువాత విశాఖలో భూ తగాదాకు సంబంధించి మరో యువకుడిని చంపేసి ఇక్కడ రోడ్డు పక్కనే పడేసి వెళ్లిపోయారు. తాజాగా శనివారం ఒక మహిళను కర్కశంగా గొంతు కోసి చంపేశారు. ఇలాంటి ఘటనలు గతంలో చాలా చోటుచేసుకున్నాయి.

పోలీసుల నిఘా కరువు
నేరాలకు నిలయంగా మారిన ఈ ప్రాంతంపై పోలీసులు దృష్టి సారించలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిని ఆసరాగా తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు అనువుగా మార్చుకున్నారు. దీనివల్ల పరిసర ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో నేర సామ్రాజ్యం విస్తరిస్తున్నా పోలీసుల నిఘా కరువైంది. కనీసం రోజూ సాయంత్రం వేళల్లోనైనా వీరు దృష్టి సారిస్తే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉందని పలువురు సూచిస్తున్నారు.

గస్తీ ఏర్పాటు చేస్తాం
అప్పనదొరపాలెం తోటలపై దృష్టి సారిస్తాం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్టుకట్ట వేస్తాం. గస్తీ ఏర్పాటుచేసి నిఘా పెంచుతాం. నేరాల నియంత్రణకు ప్రణాళికపరంగా చర్యలు తీసుకుంటున్నాం.
– ఎన్‌.సింహాద్రినాయుడు, పట్టణ సీఐ 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు