నగర రూపురేఖలు మారుస్తా..

14 Dec, 2014 03:18 IST|Sakshi
నగర రూపురేఖలు మారుస్తా..

బెజవాడ బ్యూటిఫికేషన్‌కు రూ.15కోట్లు
కళాక్షేత్రం అభివృద్ధికి రూ.4కోట్లు
డీఆర్‌ఆర్ ఇండోర్ స్టేడియానికి రూ.1.5 కోట్లు
ఎయిర్‌పోర్టు టెర్మినల్ ఆధునికీకరణకు రూ.50కోట్లు
కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ
విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు

 
విజయవాడ : రాజధాని విజయవాడ నగరం చెత్తాచెదారంతో నిండిపోయిందని, తాను ఐదారుసార్లు పర్యటించి పూర్తిగా పక్షాళన చేసి రూపురేఖలు మారుస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు ప్రకటించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఉదయం సీఎం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఇరిగేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో సీఎం మాట్లాడారు. సిటీ బ్యూటిఫికేషన్ కోసం వివిధ శాఖ అధికారులతో కమిటీ వేస్తామని చెప్పారు. నగరాన్ని బ్యూటిఫికేషన్ చేసేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పేపరు, ప్లాస్టిక్, మెటల్ వంటి వ్యర్థ పదార్థాలను వేరుచేసి ప్రక్షాళన చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించినట్లు సీఎం వివరించారు. కాల్వగట్లను అభివృద్ధి చేస్తామని, ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ రూ.1,500 కోట్లతో జలరవాణాను ప్రారంభిస్తుందని తెలిపారు. ఐదు ఎకరాల్లో నాలుగు వేల ఇళ్లను నిర్మించి నగరంలోని మూడు కాల్వల గట్లపై ఉన్న వారిని తరలిస్తామని చెప్పారు.

ఇంద్రకీలాద్రి వద్ద ఫ్లై ఓవర్ ప్రతిపాదనలు  కేంద్రానికి పంపాం

ఇంద్రకీలాద్రి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లై ఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపామని, కేంద్రం నిధులు మంజూరు కాగానే అభివృద్ధిపనులు ప్రారంభిస్తామని సీఎం చెప్పారు. రామలింగేశ్వరనగర్‌లో రెండు లక్షల మంది కలుషిత నీరు తాగుతున్నారని, వారికి మంచినీరు అందించేందుకు రూ.52కోట్లతో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. నగరంలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ1.5 కోట్లు, తుమ్మలపల్లి కళాక్షేత్రానికి రూ.4కోట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి నాలుగు రోడ్ల విధానం అమలుచేస్తామని తెలిపారు. గన్నవరం ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. టెర్మినల్ బిల్డింగ్ ఆధునికీకరణకు రూ.50 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు.
 
నిధుల దుర్వినియోగంపై విచారణ


నగరపాలక సంస్థ పరిధిలో వివిధ పథకాల అమలు కోసం రూ.350 కోట్లు అప్పు తెచ్చారని, ఈ నిధులతో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా బీఆర్‌టీఎస్ వంటి రోడ్లు నిర్మించారని సీఎం పేర్కొన్నారు.దీనివల్ల కార్పొరేషన్ ప్రతి నెల రూ.3 కోట్లు వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు.  నిధుల దుర్వినియోగంపై విచారణ చేయిస్తామన్నారు.
 
 
 అధికారుల గుండెల్లో నిద్రపోయా : సీఎం


అధికారుల సమీక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ గతంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 100 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారుల గుండెల్లో నిద్రపోయానని తెలిపారు. సమాజంలో మార్పు తీసుకురావడం కోసం అధికారుల్ని పరుగులు పెట్టించేవాడినని, బహిరంగంగా నిలదీసేవాడినని చెప్పారు. ప్రస్తుతం తన విధానం మార్చుకున్నానని, అందరూ కలిసి రావాలని, కష్టించేతత్వం గల అధికారుల్ని స్వాగతిస్తానని, పనిచేయని వారిని విడిచిపెట్టే ప్రశ్నే లేదన్నారు. ఇక నుంచి ప్రతి వారం ఆకస్మిక తనిఖీలు చేస్తానని, పనితీరు బాగుంటే పిలిచి కాఫీ ఇస్తానని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటానని సీఎం హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, పి.నారాయణ, ఎంపీ కేశినేని శ్రీనివాస్(నాని), ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమా, శ్రావన్‌కుమార్, జెడ్పీ చైర్‌పర్సన్  గద్దె అనూరాధ, మేయర్ కోనేరు శ్రీధర్, జిల్లా కలెక్టర్ ఎం.రఘునందనరావు, జాయింట్ కలెక్టర్ జె.మురళి, సబ్ కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ సి.హరికిరణ్, డెప్యూటీ మేయర్ గోగుల రమణ, తదితరులు పాల్గొన్నారు.   
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా