వరదల కారణంగా రేపటి వరకు గడువు పెంచిన ప్రభుత్వం

10 Aug, 2019 20:03 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల దరఖాస్తు గడువు పెంచుతున్నట్లు మున్సిపల్‌ శాఖ ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. వరదల కారణంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోని అభ్యర్థులు గడువు పెంచమని కోరారని అధికారులు తెలిపారు. వారి అభ్యర్థన మేరకు దరఖాస్తుల గడువును ఈ నెల 11 (రేపు ఆదివారం) అర్థరాత్రి 12గంటల వరకు పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ క్రమంలో 13 జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆదివారం రాత్రి 12 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ఏపీ ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,26,728 ప్రభుత్వోద్యోగాల భర్తీకి నిర్వహించే రాతపరీక్షకు దరఖాస్తులు వెల్లువలా వచ్చిపడుతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి 21 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. మరోక రోజు గడువు పెంచడంతో 22 లక్షల వరకు దరఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. మొత్తం 19 రకాల ఉద్యోగాలను నాలుగు రకాలుగా వర్గీకరించి.. వాటికి సెప్టెంబరు 1, 8 తేదీలలో ఉదయం, సాయంత్రం రెండు పూటలా వేర్వేరుగా రాతపరీక్ష నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు