సారూ..దయచూపండి!

26 Feb, 2019 12:03 IST|Sakshi
అర్జీలు స్వీకరిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, ఇతర జిల్లా అధికారులు

సమస్యలపై వెల్లువలా వినతులు

‘మీ కోసం’లో వివిధ సమస్యలపై 343 అర్జీలు

అనంతపురం అర్బన్‌ : ‘అయ్యా.. ఎప్పటి నుంచో తిరుగుతున్నాం.. అయినా సమస్యలు పరిష్కరించేవారులేరు.. మీరైనా దయచూపండి ’ అంటూ అధికారులకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు విన్నవించుకున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘మీకోసం’లో ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు, జేసీ–2 హెచ్‌.సుబ్బరాజు, ఏపీఎంఐపీ పీడీ వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏడీ జి.విద్యావతి వినతి పత్రాలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 343 అర్జీలు అందాయని అధికారులు తెలిపారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులు ఇలా..
మడకశిర, కళ్యాణదుర్గం డివిజన్లలో శ్రీరామరెడ్డి నీటి పథకంలో పని చేస్తున్న 255 మంది కార్మికులకు 49 నెలల పీఎఫ్‌ నిధులు చెల్లించలేదని శ్రీరామిరెడ్డి వాటర్‌ స్కీం కార్మిక సంఘం గౌరవ సలహాదారు జి.ఓబుళు, గౌరవాధ్యక్షుడు నాగరాజు, అధ్యక్ష, కార్యదర్శులు రామాంజి, బాషా విన్నించారు.  
హిందూపురం మండలం కగ్గళ్లు గ్రామానికి చెందిన శ్రీరాములు అనే దివ్యాంగుడికి కిడ్నీలు పాడై కుడికాలు పూర్తిగా దెబ్బతినింది. వైకల్య ధ్రువీకరణ పత్రం లేకపోవడంతో పింఛన్‌ మంజూరు చేయలేదని జేసీతో తన గోడు వెల్లబోసుకున్నాడు. సదరం క్యాంపులో ధ్రువపత్రం ఇప్పించి, పింఛన్‌ మంజూరు చేయాలని కోరాడు.
కుందుర్పి గ్రామంలోని న్యూ విన్సెంట్‌ ఫెర్రర్‌ కాలనీలో 112 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, సబ్‌ప్లాన్‌ నిధులతో విద్యుత్‌ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేయాలని ఏడాదిగా విన్నవిస్తున్నా పట్టించుకోలేదని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కుందుర్పి ఓబయ్య, గ్రామస్తులు విన్నవించారు.
తమ భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించడం లేదని బుక్కరాయసముద్రం కొత్తపల్లికి చెందిన కె.ఆర్‌.రెడ్డి ఫిర్యాదు చేశాడు. గోవిందంపల్లి గ్రామ పొలం సర్వే నంబరు 83–4బిలో తమకున్న ఐదు ఎకరాల భూమిని ఆన్‌లైన్‌లో చూపించలేదని తెలిపాడు.
ఏళ్లగా సాగు చేసుకుంటున్న భూమికి పట్టాదారు పాసుపుస్తకం ఇవ్వాలని పరిగి మండలం పరిగికి చెందిన అంజినప్ప విన్నవించాడు. సర్వే నంబరు 365–4లో 2.75 ఎకరాల భూమిని 60 ఏళ్లగా సాగు చేసుకుంటున్నామని, సాగుపట్టా ఇవ్వాలని కోరాడు.
తన భర్త బాలగుర్రప్ప ఆనారోగ్యంతో మరణించాడని, కుటుంబ పోషణ భారంగా మారిందని తాడిపత్రి మండలం గన్నెవారిపల్లికి చెందిన బి.పెద్దక్క విన్నవించింది. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇప్పించాలని కోరింది.
మా పేరున ఉన్న భూమిని వేరొకరి పేరున ఆన్‌లైన్‌లో నమోదు చేశారని తనకల్లు మండలం వంకపల్లికి చెందిన బుగిడే రామచంద్ర విన్నవించారు. తన పేరున సర్వే నంబరు 1073–10లో 21.5 ఎకరాల భూమి ఉందని చెప్పాడు. ఈ భూమిని వేరొకరి పేరున నమోదు చేశారని, దాన్ని రద్దు చేసి, తన పేరున మార్పు చేయాలని కోరాడు.
తన కుమార్తె సుదేషిని కిడ్నీ వ్యాధితో బాధపడుతోందని, ఎన్టీఆర్‌ వైద్య సేవ పథకం ద్వారా వైద్యం అందించాలని నార్పల మండలం నడిమిపల్లికి చెందిన ఎం.వెంకటస్వామి విన్నవించాడు. 

మరిన్ని వార్తలు