‘స్థానిక’ ఎన్నికల పరిశీలకుల నియామకం

10 Mar, 2020 04:04 IST|Sakshi

13 జిల్లాలకు 13 మంది సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు

అదనంగా మరో నలుగురు నియామకం

వీరితో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భేటీ

కోడ్‌ అమలులో పరిశీలకులకు పూర్తి అధికారాలు

సాక్షి, అమరావతి: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రతి జిల్లాకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిని పరిశీలకునిగా నియమించింది. ఇలా 13 జిల్లాలకు 13 మంది, అదనంగా మరో నలుగురిని నియమించింది. జిల్లాల్లో ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడం.. ఎన్నికల కోడ్‌ అమలు పర్యవేక్షణ వీరి ప్రధాన విధి అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ఎన్‌. రమేష్‌కుమార్‌ తెలిపారు. కోడ్‌ ఉల్లంఘన ఫిర్యాదులపై నిర్ణయాలు తీసుకునేందుకు పరిశీలకులకు పూర్తి అధికారాలు కల్పించినట్లు ఆయన చెప్పారు. 13 జిల్లాల పరిశీలకులతో సోమవారం ఆయన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఎవరికి కేటాయించిన జిల్లాకు వారు వెంటనే వెళ్లి విధుల్లో చేరాలని ఆదేశించారు. ఎన్నికల సిబ్బందికి జరుగుతున్న శిక్షణ కార్యక్రమాల వివరాలు, కోడ్‌ ఉల్లంఘనలపై ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నివేదికను ప్రతిరోజూ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు పంపాలని సూచించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

ఎన్నికల పరిశీలకులందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలి. వారి ఫోన్‌ నంబర్, చిరునామా మీడియా ద్వారా తెలియజే యాలి. ఎటువంటి ఆరోపణలకు తావు లేకుండా నిర్భయంగా విధులను నిర్వర్తించాలి.
- అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో మాదిరిగానే కోడ్‌ అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలి.
- ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తిగత పథకాలు కోడ్‌ అమలులో ఉన్న సమయంలో నిలిచిపోతాయి. 
- ఎన్నికల్లో వలంటీర్ల సేవలు వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
బ్యాలెట్‌ పేపర్ల విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. 
సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ కార్యదర్శి ఎస్‌.రామసుందర రెడ్డి, జాయింట్‌ సెక్రటరీ ఏవీ సత్య రమేష్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు