హైకోర్టులో ముగ్గురు జడ్జిల నియామకం

2 May, 2020 02:59 IST|Sakshi

కృష్ణమోహన్, సురేష్‌రెడ్డి, లలితకుమారిలను ఎంపికచేసిన ‘సుప్రీం’ కొలీజియం

సాక్షి, అమరావతి: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులుగా న్యాయవాదులు బొప్పూడి కృష్ణమోహన్, కంచిరెడ్డి సురేష్‌రెడ్డి, కన్నెగంటి లలితకుమారిలు నియమితులయ్యారు. వీరి నియామకానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ శుక్రవారం ఆమోదముద్ర వేస్తూ నియామక ఉత్తర్వులిచ్చారు. దీంతో వీరి నియామకాలను నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. వీరు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జితేంద్రకుమార్‌ మహేశ్వరి ప్రమాణం చేయించనున్నారు.

ఈ ముగ్గురి నియామకంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 21కి చేరుకోనుంది. వాస్తవానికి హైకోర్టు కొలీజియం మొత్తం ఆరుగురు న్యాయవాదుల పేర్లను న్యాయమూర్తుల పోస్టులకు సిఫారసు చేసింది. హైకోర్టు పంపిన కృష్ణమోహన్, సురేష్‌రెడ్డి, లలితకుమారి, వి.మహేశ్వర్‌రెడ్డి, జీఎల్‌ నర్సింహారావు, కె.మన్మథరావుల పేర్లలో సుప్రీంకోర్టు కొలీజియం కృష్ణమోహన్, సురేష్‌రెడ్డి, లలితకుమారి పేర్లను మాత్రమే కేంద్రానికి పంపింది. ఈ ముగ్గురిలో లలిత పిన్న వయస్కురాలు. ప్రస్తుతం ఆమె వయస్సు 48 సంవత్సరాల, 11 నెలలు. ఈమె 2033 మే 4న, కృష్ణమోహన్‌ 2027, ఫిబ్రవరి 4న, సురేశ్‌రెడ్డి 2026, డిసెంబర్‌ 6న హైకోర్టు న్యాయమూర్తులుగా పదవీ విరమణ చేస్తారు. 

మరిన్ని వార్తలు