ముందు ‘చూపు’ భేష్‌ 

29 Oct, 2019 04:48 IST|Sakshi

‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకంపై సర్వత్రా ప్రశంసలు

అవసరమైన వారందరికీ త్వరలో అద్దాలు ఇచ్చే ఏర్పాట్లు

‘సర్వేంద్రియాణాం.. నయనం ప్రధానం’ అన్నారు. చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దని దీని అర్థం. ఈ విషయం తెలిసినా చాలా మంది వివిధ కారణాల వల్ల నిర్లక్ష్యం చేస్తుంటారు. పేదరికం వల్ల చాలా మంది కంటి పరీక్షలు చేయించుకోవడానికి వెనకాడుతుంటారు. ఈ విషయాన్ని సీరియస్‌గా గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకాన్ని తీసుకొచ్చారు. 

పశ్చిమగోదావరి జిల్లా వట్లూరులో మూడవ తరగతి చదువుతున్న పఠాన్‌ అన్సర్‌ నిరుపేద కుటుంబానికి చెందిన వాడు. తనకు కంటి చూపు బాగుందో లేదో కూడా తెలియదు. డాక్టర్లు స్కూలుకు వచ్చి పరీక్షలు చేశాక చూపులో సమస్య ఉందని తేలింది. విశాఖపట్నంలోని ఓ మున్సిపల్‌ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న లక్ష్మికుమారిదీ ఇదే సమస్య. ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ ద్వారా వీరి సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం దొరికింది.  

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ముందు చూపు లక్షలాది మంది చిన్నారుల కళ్లలో వెలుగు నింపుతోంది. కంటిచూపు మందగించినా, అక్షరాలు మసక మసకగా కనిపించినా.. సమీపంలో డాక్టరు లేక, ఉన్నా వైద్యానికి ఖర్చు చేయలేక అలాగే ఉండిపోయి ఇబ్బందులు పడుతున్న ఎందరో చిన్నారులకు వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం వరంగా మారింది. ఒకరు కాదు.. ఇద్దరు కాదు..60,668 స్కూళ్లలో 69,43,052 లక్షల మంది చిన్నారులకు ఈ పథకం కింద కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపే దిశగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అడుగులేస్తోంది.

రాష్ట్రంలో వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం మహోద్యమంలా సాగుతో ఇప్పటివరకు 2,12,024 మంది బాలికలకు, 2,18,898 మంది బాలురకు కంటి సమస్యలు ఉన్నట్టు తేలింది. మొత్తంగా బాలురలోనే ఎక్కువ కంటి సమస్యలు ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. వీరిలో పెద్ద పెద్ద సమస్యలున్న చిన్నారులందరికీ బోధనాసుపత్రిలో మెరుగైన వైద్యం (శస్త్రచికిత్స) చేయించి, ఉచితంగా కళ్లజోడు ఇచ్చేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పథకం అమలులో ప్రభుత్వ వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, ఉపాధ్యాయులు, ఆరోగ్యశాఖ అధికారులు ఇలా ఎంతోమంది భాగస్వాములయ్యారు. మొత్తం ఆరు దశల్లో జరిగే కార్యక్రమంలో త్వరలోనే పెద్దవారికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు పంపిణీ చేస్తారు. 

మేమే వాళ్ల దగ్గరకు వెళ్లాం
వైఎస్సార్‌ కంటి వెలుగు పథకం ప్రజల చెంతకే వెళ్లి సేవలందించే పథకం. వైద్యులు, వైద్య సిబ్బంది స్కూళ్లకు వెళ్లకపోతే ఆ చిన్నారులు ఆస్పత్రులకు రాలేరు. దీనివల్ల వారికి ఉన్న సమస్యలూ గుర్తించలేం. సమస్య తీవ్రతరమయ్యాక ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రస్తుతం ఈ పథకం వల్ల కంటి సమస్యలు గుర్తించే ప్రక్రియ సులభమవుతోంది. ఉపాధ్యాయులకు, ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇస్తే ప్రాథమికంగా కంటి సమస్యలు గుర్తించ వచ్చు. ఆరు మీటర్ల దూరంలో ఒక చార్ట్‌ ఇచ్చి అక్షరాలు చదవమంటే వారిలో దృష్టి లోపం ఉందో లేదో సులభంగా తెలుసుకోవచ్చు. విటమిన్‌ ఎ ద్రావణం తగినంత లేదు. ఇది పుష్కలంగా సరఫరా చేయాల్సి ఉంది. 50 ఏళ్లు దాటితే ఏడాదికోసారి కంటి పరీక్షలు విధిగా అవసరం.     
– డా.పల్లంరెడ్డి నివేదిత, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, కర్నూలు

చాలా బాగుంది
పాఠశాల విద్య అభ్యసించే చిన్నారులందరికీ కంటి పరీక్షలు నిర్వహిస్తుండటం చాలా గొప్ప విషయం. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థులందరూ పేద, మధ్యతరగతి వారే. వారంతకు వారు స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వీలుండేది కాదు. అటువంటిది వైద్యులే పాఠశాలకు వచ్చి పరీక్షలు నిర్వహించడం చాలా బాగుంది.    
–పి. నాగమణి, ప్రధానోపాధ్యాయురాలు, నగరపాలకోన్నత పాఠశాల (మెయిన్‌), కడప

మంచి పరిణామం
ప్రజల నేత్ర సంరక్షణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రవేశ పెట్టిన వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ఎంతో బాగుంది. పాఠశాలలకే వెళ్లి, విద్యార్థులకు కంటి పరీక్షలు చేయించి అవసరమైన వారికి కళ్లజోళ్లు ఉచితంగా అందించడం, శస్త్ర చికిత్సలను సైతం ఉచితంగా చేయించాలని నిర్ణయించడం మంచి పరిణామం.  
 – గోదా నాగలక్ష్మి, గుంటూరు

గుంటూరులో
ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన వైఎస్సార్‌ కంటివెలుగు కార్యక్రమంలో గుంటూరు జిల్లాలో కంటి సమస్యలతో బాధపడుతున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్నట్టు తేలింది. ఈ జిల్లాలో 47,499 మంది స్కూలు విద్యార్థులు కంటి చూపునకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. ఆ తర్వాత విశాఖ జిల్లాలో 46,002 మంది విద్యార్థులు కంటి సమస్యలతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. కంటి పరీక్షల స్క్రీనింగ్‌లోనూ, బాధితుల సంఖ్యలోనూ విజయనగరం జిల్లా చివరలో ఉంది. ఇక్కడ 3,03,819 మందికి పరీక్షలు నిర్వహించగా, 12,959 మంది విద్యార్థులకు మాత్రమే కంటి సమస్యలున్నాయి.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు