నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం

12 Jul, 2018 10:10 IST|Sakshi
 సదస్సులో మాట్లాడుతున్న మంత్రి కొల్లు రవీంద్ర

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యం కల్పించి నిరుద్యోగ యువతకు శిక్షణతో పాటు ఉపాధిని కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తోందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి శాఖా మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్థానిక నోవాటెల్‌ హోటల్‌లో బుధవారం జరిగిన ‘ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ స్కీమ్‌ ఇన్‌ ఏపీ’ సదస్సులో ముఖ్య అతిథిగా ప్రసంగించారు. అ ప్రెంటిస్‌షిప్‌ విధానంపై పరిశ్రమల్లో ఉన్న అపోహలను తొలగించడమే సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా పరిశ్రమలు న్నా.. మెజారిటీ వాటిల్లో ఈ విధానాన్ని అమలు చేయడం లేదన్నారు. ఏదైనా పరిశ్రమ ఇది అమలుచేస్తే వారికిచ్చే శిక్షణలో 25శాతాన్ని ప్రభుత్వం తిరిగి ఆ కంపెనీకి చెల్లిస్తుందని తెలిపారు. దీని ద్వారా నెలకు ఒక్కో విద్యార్థికి రూ.1500 స్టైఫండ్‌ అందిస్తారన్నారు.

కేంద్రం రూ.10 వేల కోట్ల కేటాయింపు..
దేశవ్యాప్తంగా 50 లక్షల మంది నిరుద్యోగులకు శిక్షణనివ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు కేటాయించిందని, నేటికి రూ.200 కోట్లు మాత్రమే ఖర్చుచేశామన్నారు. త్వరలో 10 లక్షల నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం భృతి ఇవ్వనుందని, వారికి అప్రెంటిస్‌ షిప్‌ను అనుసంధానించాలన్న ఆలోచనలో ఉన్నామన్నారు. సర్వీస్‌ సెక్టార్లు అగ్రికల్చర్, ఆక్వాకల్చర్, సెరికల్చ ర్‌లో 5 లక్షల వరకూ ఉపాధి అవకాశాలున్నాయని, ఈ తరహా శిక్షణ అందించి ఉపాధి కల్పించనున్నామన్నారు.

దేశంలోనే ‘ఈజీ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’లో ఏపీ ప్రథమ స్థానంలో నిలించిదని కొనియాడారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ కె.సాంబశివరావు మాట్లాడుతూ అప్రెంటిస్‌షిప్‌ విధానంపై అపోహలు తొలగించేందుకు ట్రైనింగ్‌ పార్టనర్‌లతో ఈ సదస్సు ఏర్పాటు చేశామని చెప్పారు. ఈ స్కీమ్‌ ఉద్యోగం కాదని, భవిష్యత్తులో ఉపాధి పొందడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుందన్నారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జె.ఎస్‌.వి ప్రసాద్, యూత్‌ ఎఫైర్స్‌ చీఫ్‌ సెక్రటరీ ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం, ఏపీఎస్‌డీసీ డైరక్టర్‌ కె.లక్ష్మీనారాయణ, సీఐఐ మాజీ చైర్మన్‌ జి.ఎస్‌.శివకుమార్, పలు పరిశ్రమల ప్రతినిధులు, ట్రైనింగ్‌ పార్టనర్స్, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు