నిజమైన రైతుకు తగిన గుర్తింపేది...?

30 Dec, 2014 00:53 IST|Sakshi
నిజమైన రైతుకు తగిన గుర్తింపేది...?
  • వీడ్కోలు సమావేశంలో జస్టిస్ నర్సింహారెడ్డి ఆవేదన
  • ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
  • సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ లింగాల నర్సింహారెడ్డికి ఉమ్మడి హైకోర్టు సోమవారం ఘనంగా వీడ్కోలు పలికింది. జస్టిస్ నర్సింహారెడ్డికి వీడ్కోలు పలికేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

    ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల అడ్వకేట్స్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి, పి.వేణుగోపాల్, న్యాయవాదులు, జస్టిస్ నర్సింహారెడ్డి కుటుంబ సభ్యులు, హైకోర్టు రిజిష్ట్రార్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరువురు ఏజీలు కూడా న్యాయవ్యవస్థకు జస్టిస్ నర్సింహారెడ్డి చేసిన సేవలను కొనియాడారు.  జస్టిస్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ... వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వారు పలు విషయాలను సరిగ్గా అర్థం చేసుకోలేరన్న భావన తప్పన్నారు.

    వ్యవసాయ కుటుంబంలో పుట్టడం వల్లే తాను న్యాయమూర్తిగా పలు సమస్యలను, వివాదాలను స్పష్టతతో అర్థం చేసుకోగలిగే స్థితిలో ఉన్నానని, ఈ విషయం గర్వంగా చెప్పగలనని తెలిపారు. అన్ని వృత్తుల్లోకెల్లా వ్యవసాయమే అత్యుత్తమైనదని తన నమ్మకమన్నారు. అయితే దురదృష్టవశాత్తూ ప్రభుత్వాల ఏకపక్ష విధానాల వల్ల, సమాజంలో మారిన విలువల వల్ల వ్యవసాయ రంగం తన మనుగడ కోసం పోరాటం చేస్తోందని చెప్పారు. ఒక మోసకారి వ్యాపారవేత్తకు గుర్తింపును ఇచ్చే మీడియా, సమాజం.. ఓ విజయవంతమైన రైతుకు గుర్తింపునివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
     
    అప్పుడు సరస్వతి నమస్తుభ్యం..

    పాఠ్యపుస్తకాల నుంచి సంస్కృతిని, విలువను తీసిపారేస్తున్న మన ఆధునిక విద్యావేత్తలకు ధన్యవాదాలు చెప్పాలంటూ జస్టిస్ నర్సింహారెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఒకప్పుడు చిన్నారులు సరస్వతి నమస్తుభ్యమంటూ చదువులు ప్రారంభిస్తే, ఇప్పుడు బాబా బ్లాక్ షిప్, ఈటింగ్ షుగర్ టెల్లింగ్ లైస్ అంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. హైకోర్టుతో తనకున్న మూడున్నర దశాబ్దాల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. న్యాయవాద వృత్తిలో తన గురువు, ప్రముఖ న్యాయవాది పి.బాబుల్‌రెడ్డి తనకు మెళకువలు నేర్పితే, ఆయన కుమారుడు పి.ప్రభాకర్‌రెడ్డి వృత్తిలో ఎదిగేందుకు  ప్రోత్సహించారని తెలిపారు.

    న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది సహకారం, మద్దతువల్లే తాను అత్యుత్తమైన తీర్పులను ఇవ్వడం సాధ్యమైందన్నారు. తన తీర్పుల్లో ఉండే దయా, సానుభూతి గుణాలున్నాయంటే అందుకు తన తల్లే కారణమని చెప్పారు. తనకు విధి నిర్వహణలో సహకరించిన వారందరికీ  ఆయన పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. హైకోర్టు న్యాయవాదుల సంఘం జస్టిస్ నర్సింహారెడ్డిని సన్మానించింది.
     

>
మరిన్ని వార్తలు