జడవకండి

6 Feb, 2014 04:06 IST|Sakshi

పాలమూరు, న్యూస్‌లైన్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా ఉండేలా తగిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకుగాను గ్రామాల వారీగా తమ శాఖకు చెందిన సిబ్బందితో సర్వే నిర్వహిస్తున్నామని ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ, శానిటేషన్ మిషన్ మెంబర్ కార్యదర్శి కృపాకర్‌రెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 15 కల్లా సర్వే పూర్తిచేసి తగిన ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. జాతీయ గ్రామీణ తాగునీటి పథకం (ఎన్‌ఆర్‌డబ్ల్యుపీ) ద్వారా శాశ్వత చర్యలకు గాను జిల్లాకు రూ.6.28 కోట్లు     కేటాయించారన్నారు. శాఖా పరంగా చేపడుతున్న పలు అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై పలు అంశాలు..  ఆయన మాటల్లోనే..
 
 వర్షాలు సమృద్ధిగా పడటంతో.. జిల్లాలో కొన్ని చెరువుల్లో నేటికీ నీరు నిలిచి ఉన్న కారణంగా భూగర్భ జలాల స్థాయి నిలకడగా ఉంది. గతేడాది పిబ్రవరి నెలలోనే పలుగ్రామాల్లో ట్యాంకర్‌ల ద్వారా పంపిణీ చేపట్టాం.ఈసారి జిల్లాలో తాగునీటికి అంతగా ఇబ్బంది ఉండదని భావిస్తున్నాం. ఈ కారణంగానే గ్రామాల్లో నీటివనరులపై సర్వే చేపట్టాం. ఆ తర్వాత  పరిస్థితుల ఆధారంగా ప్రత్యామ్నాయం చేపడతాం.
 
 నిధులకు ఢోకా లేదు..
 నిధుల కొరత ఏమీ లేదు.  ఆన్‌లైన్ విధానం ద్వారా ఎప్పటికప్పుడు ఆయా పనులను నమోదు చేస్తే నిధులు మంజూరవుతాయి. ఏడాదిలో మూడుసార్లు స్టేట్‌లెవల్ సెలక్షన్ కమిటీ (స్లాక్స్) సమావేశం జరుగుతుంది. ఇందులో ప్రతిపాదనలు పెట్టి సమస్యాత్మక గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి కావల్సిన పనులకు అనుమతి పొందుతాం. సాధారణమైన వాటికి  కలెక్టర్ అనుమతితో ప్రత్యామ్నాయ చర్యలు చేపడతాం.
 
 అయిదు కేటగిరీలుగా ఎంపిక
 సమస్యాత్మక గ్రామాలను అయిదు కేటగిరీలుగా విభజించి ఎంపిక చేస్తాం. అందులో ఏమాత్రం నీటి వనరులు లేని గ్రామాలను ఎన్‌ఎస్‌ఎస్ (నో సేఫ్ సోర్స్) కేటగిరీ కింద నిర్ణయించి వీటికి కచ్చితంగా నీరందించేందుకు చర్యలు చేపడతాం.
 
 పీసీ-1 కేటగిరీలో ఆయా గ్రామాల్లో ఉన్న జనాభాను బట్టి ఒక్కొక్కరికి 10 లీటర్ల కంటే తక్కువ నీరు అందే పరిస్థితులు ఉంటే  వారికోసం  బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్, వ్యవసాయ బోర్‌ల లీజ్,  నీటిని సరఫరా చేసేందుకు ట్యాంకర్‌లు తదితర చర్యలు చేపడతాం. పీసీ2 నుంచి పీసీ4 వరకు (20 నుంచి 40 లీటర్ల లోపు నీటి సామర్థ్యం కలిగిన గ్రామాల్లో) కేటగిరీల్లో అక్కడి అవసరాలను బట్టి ప్రజలకు ఉపయోపడే విధంగా బోర్ల ఫ్లషింగ్, డీపనింగ్ చేపడతాం. కాంట్రాక్టు విధానం ద్వారా చేపట్టే ఈ పనులకు సంబంధించి బిల్లులు  సమర్పిస్తే సంబంధిత వ్యక్తులకు డబ్బులు ఆన్‌లైన్‌లోనే అందిస్తాం
 పది ల్యాబుల్లో పరీక్షలు
 నీటి శుద్ధతను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు 10 ల్యాబుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నాం. గతేడాది మా శాఖలో 15 శాతం సిబ్బంది మాత్రమే ఉండేది. ఆ మధ్య చేపట్టిన ఏపీపీఎస్సీ నియామకాలతో జిల్లాకు 19 మంది ఏడబ్ల్యుఈలు, 28 మంది ఏఈలు వచ్చారు. దీంతో సిబ్బంది కొరతను అధిగమించగలిగాం.
 పారిశుద్ధ్యంపై విసృ్తత ప్రచారం
 గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధంగా పంచాయతీలకు సాంకేతిక పరంగా మా శాఖ ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. ఈ సమస్య తీవ్రతను తగ్గించే ప్రయత్నిస్తున్నాం.  ప్లాస్టిక్ వినియోగం వల్ల కలిగే నష్టాలు, పారిశుద్ధ్య చర్యలు చేపట్టే విధానాన్ని కూడా వివరిస్తున్నాం. పల్లెల్లో పారిశుద్ధ్య చర్యలు సమర్థంగా చేపట్టిన వారికి నిర్మల్ పురస్కారంతో  ప్రోత్సహిస్తున్నాం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యల  పురోగతి సాధ్యమవుతోంది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు రానున్నాయి.
 
 నిర్మల్ భారత్‌పై ప్రత్యేక దృష్టి...!
 నిర్మల్ భారత్ అభియాన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రత్యేక దృష్టి పెట్టాం. 2013-14 సంవత్సరానికి గాను 1 లక్ష మరుగు దొడ్ల నిర్మాణం లక్ష్యం కాగా.. ఇందులో 40వేలకు పైగా పూర్తి చేయగలిగాం. ముఖ్యంగా పల్లెల్లోని ప్రజలకు మరుగుదొడ్ల ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలను విసృ్తత పరిచాం.  
 
 గోడలపై రాతలు, రెండు చోట్ల నిర్మల్ భారత్ అభియాన్ ఉద్దేశాన్ని వివరించే బోర్డులను ఏర్పాటు చేశాం. జిల్లా వ్యాప్తంగా 64 బృందాలను ఏర్పాటు చేసి వాటి ద్వారా  సీఎల్‌డీఎస్ పద్ధతిన గ్రామ ప్రజలతో ప్రత్యేకంగా సమావేశమై మరుగుదొడ్ల నిర్మాణం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియపరుస్తున్నాం. వీటి నిర్మాణాలు పెంచేందుకు మండల కోఆర్డినేటర్లను నియమించాం. ఇప్పుడు గ్రామ కోఆర్డినేటర్‌లను నియమించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామాల్లో నిర్మల్ అభియాన్ పథకాన్ని అమలుపర్చే కోఆర్డినేటర్లకు నెలసరి వేతనం కాకుండా ఒక మరుగుదొడ్డిని నిర్మిస్తే రూ.75 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విధానం ద్వారా గ్రామాల్లో పూర్తి స్థాయిలో మరుగుదొడ్లను నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది.
 
 అన్ని ఇళ్లల్లో కొళాయిల ఏర్పాటు..
 జిల్లా వ్యాప్తంగా ఆయా గ్రామాల పరిధిలో చేపట్టిన పరిశీలన ఆధారంగా ఇళ్లల్లో మంచినీటి కొళాయిలను ఏర్పాటు చేసుకున్న వారు 23శాతం మంది ఉన్నారు. మిగతావారు వీధుల్లో వినియోగించ కుండా ప్రతీ ఇంటికి కొళాయిలు ఏర్పాటు చేసుకునే విధంగా కృషి చేస్తున్నామన్నారు.

>
మరిన్ని వార్తలు