అధికారాంతమునా బాబు చేతివాటం

10 Mar, 2019 04:24 IST|Sakshi

ఎన్నికలకు ముందు 17 ప్రాజెక్టులకు ఆగమేఘాలపై అనుమతి

ఆర్థికశాఖ అభ్యంతరం చెప్పిన ఫైళ్లపై సీఎం సంతకం చేసి ఆమోదముద్ర

జీవో 94కు విరుద్ధంగా టెండర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తప్పవంటూ అంతర్గత ఉత్తర్వులు

టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే ‘కోటరీ’ కాంట్రాక్టర్లతో ‘బేరాలు’

వారికే పనులు దక్కేలా నిబంధనలతో టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ.. 

అనంతరం ఈ నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపు

నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18 వేల కోట్ల విలువైన పనుల అప్పగింత

మొత్తంగా రూ.ఆరు వేల కోట్ల దోపిడీ..

ఎన్నికల్లో టీడీపీకి ఇం‘ధనం’ సమకూర్చే వ్యూహం పక్కాగా అమలు

ఈ వ్యూహంలో జలవనరులశాఖ కార్యదర్శి పావుగా మారడంపై అధికారుల్లో ఆవేదన

పారదర్శకంగా టెండర్లు నిర్వహించివుంటే..6 వేల కోట్లు మిగిలేదని వెల్లడి

సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడిన చంద్రబాబు సర్కారు అధికారాంతంలోనూ చేతివాటం ప్రదర్శిస్తోంది. ఎన్నికలకు ముందు తన దోపిడీ పథకానికి మరింత పదును పెట్టింది. ప్రభుత్వ ఖజానాను దోచేసి.. పార్టీకి మరింత ఇం‘ధనం’ సమకూర్చిపెట్టడం ద్వారా ఎన్నికల్లో వెదజల్లడానికి పన్నాగం వేయడమేగాక దీన్ని కేవలం నెలరోజుల్లోనే అమలు చేసింది. ఎన్నికలకు ముందు ఆగమేఘాలపై 17 ప్రాజెక్టులకు పరిపాలన అనుమతి విషయంలో చర్యలు చేపట్టింది. ఆర్థికశాఖ అభ్యంతరాల్ని సైతం తోసిరాజని సాక్షాత్తూ ముఖ్యమంత్రే సంతకం చేసి ఆమోదముద్ర వేయడం గమనార్హం. అంతేగాక జీవో 94ను తుంగలో తొక్కుతూ టెండర్లు నిర్వహించడం ద్వారా రూ.18,648.71 కోట్ల విలువైన పనులను తన కోటరీకి చెందిన నలుగురు కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. ఇందుకోసం జలవనరుల శాఖను పావుగా వాడుకున్నారు. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19% నుంచి కనిష్టంగా 3.52% ఎక్సెస్‌(అధిక) ధరకు కోట్‌ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో రూ.ఆరువేల కోట్లు ముడుపుల రూపంలో చేతులు మారినట్టు సమాచారం. సీఎం ‘దోపిడీ’ వ్యూహంలో జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ పావుగా మారారని, నిబంధనల ప్రకారం అంచనా వ్యయాన్ని నిర్ణయించి, టెండర్లు నిర్వహించి ఉంటే రూ. ఆరువేల కోట్లకుపైగా ఖజానాకు ఆదా అయ్యేదని ఆ శాఖ సీనియర్‌ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తుండడం గమనార్హం. 

అంతా దోపిడే..: రాష్ట్రంలో కేవలం రూ.17,368 కోట్లతో పెండింగ్‌ ప్రాజెక్టుల పనులన్నీ పూర్తి చేస్తామని జూలై 28, 2014న విడుదల చేసిన శ్వేతపత్రంలో సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల పనులకు 64,334 కోట్లు ఖర్చుచేసినా.. ఒక్క పెండింగ్‌ ప్రాజెక్టునూ పూర్తి చేయలేకపోయారు.. ఈ వ్యవహారంలో రూ. 25 వేల కోట్లకుపైగా బాబు అండ్‌ కో దోచేసినట్టు అధికారవర్గాలే కోడై కూస్తున్నాయి.  

ఆర్థిక శాఖ అభ్యంతరాలు తుంగలోకి..:  ఏదైనా సాగునీటి ప్రాజెక్టు పనులకు పరిపాలన అనుమతివ్వాలంటే.. సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌), హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌లు తప్పనిసరి. కానీ ఆ రెండు లేకుండానే కేవలం లైన్‌ ఎస్టిమేట్లు(ఉజ్జాయింపు అంచనాలు) ఆధారంగా గోదావరి–పెన్నా నదుల తొలిదశ అనుసంధానం, వైకుంఠపురం బ్యారేజీ, వంశధార–బాహుదా అనుసంధానం, వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్‌(రాజోలిబండ డైవర్షన్‌ స్కీం) కుడికాలువ, సోమశిల హైలెవల్‌ లిఫ్ట్‌ కెనాల్‌ రెండోదశ, ముక్త్యాల ఎత్తిపోతల, వరికపుడిశెల ఎత్తిపోతల, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌–యోగివేమన రిజర్వాయర్‌–హంద్రీ–నీవా రెండో దశ ఎత్తిపోతల, గుంటూరు ఛానల్‌ ఆధునికీకరణ, విస్తరణ తదితర పనులకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. హైడ్రలాజికల్‌ క్లియరెన్స్‌ లేకపోవడం.. కొన్ని ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర వివాదాలు ఉండటం.. కనీసం డీపీఆర్‌ లేకపోవడాన్ని ఎత్తిచూపుతూ ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చేందుకు ఆర్థికశాఖ అభ్యంతరం తెలిపింది. దాంతో ఆ ప్రాజెక్టులకు అనుమతిచ్చే ఫైళ్లపై సీఎం నేరుగా సంతకం చేశారు. ప్రాజెక్టుల అంచనా వ్యయాల రూపకల్పనలోనే వంచనకు పాల్పడిన సీఎం.. వాటికి టెండర్‌ నోటిఫికేషన్‌ చేయకముందే కోటరీ కాంట్రాక్టర్లతో బేరసారాలకు దిగారు. 

కమీషన్‌ ఇచ్చిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా..: వాస్తవానికి టెండర్లను జూలై 1, 2003న జారీ చేసిన 94 జీవో ప్రకారమే నిర్వహించాలి. కానీ 2014లో చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చాక ఆ జీవోను తుంగలో తొక్కుతూ వచ్చింది. ఎన్నికలకు ముందు చేపట్టే ప్రాజెక్టుల పనులను కోటరీ కాంట్రాక్టర్లకే కట్టబెట్టే వ్యూహంలో భాగంగా.. జీవో 94కు విరుద్ధంగా టెండర్లు నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని సీఈలను హెచ్చరిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌తో తొలుత అంతర్గత ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత నెలరోజుల వ్యవధిలోనే 17 ప్రాజెక్టులకు సంబంధించిన పనులకు టెండర్లు నిర్వహించాలని ఆదేశించారు. టెండర్‌ నోటిఫికేషన్‌ జారీ చేయకముందే కాంట్రాక్టర్లతో బేరసారాలు జరిపి.. వారిని కుమ్మక్కు చేసిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుల పనులను పంచేశారు. అనంతరం ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులు దక్కేలా నిబంధనలు రూపొందించి టెండర్‌ నోటిఫికేషన్‌లు జారీ చేయాలంటూ ఆ ప్రాజెక్టుల చీఫ్‌ ఇంజనీర్లపై సీఎం ఒత్తిడి తెచ్చారు. వాటికి తలొగ్గిన సీఈలు జీవో 94కు విరుద్ధంగా నిబంధనలను రూపొందించి.. టెండర్‌ నోటిఫికేషన్లు జారీ చేశారు.  

అక్రమాలను సక్రమం చేశారనడానికి ఆధారాలు ఇవిగో.. 
- వైకుంఠపురం బ్యారేజీ పనులకు 13.19 శాతం ఎక్సెస్‌కు నవయుగ–ఆర్వీఆర్‌(జేవీ) షెడ్యూలు దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ఐదుశాతం కంటే ఎక్సెస్‌కు షెడ్యూలు కోట్‌ చేస్తే టెండర్‌ రద్దు చేయాలి. కానీ కృష్ణా డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌పై ఒత్తిడి తెచ్చి.. వాటిని ఆమోదించేందుకు సీవోటీకి పంపారు. ఈలోగా ఐదు శాతం ఎక్సెస్‌కు షెడ్యూలు దాఖలు చేస్తే టెండర్‌ రద్దు చేయాలన్న నిబంధన నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. తర్వాత టెండర్‌పై సీవోటీ ఆమోదముద్ర వేసింది. 

వేదవతి ఎత్తిపోతల, ఆర్డీఎస్‌ కుడి కాలువ ప్రాజెక్టుల టెండర్లలో జాయింట్‌ వెంచర్లు(ఒకరు కంటే ఎక్కువ మంది కాంట్రాక్టర్లు జట్టుగా ఏర్పడటం) పాల్గొనడానికి అవకాశం లేదని నిబంధన పెట్టారు. కానీ సీబీఆర్‌–వైవీఆర్‌–హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ రెండో దశ ఎత్తిపోతల్లో జాయింట్‌ వెంచర్లు కూడా టెండర్లలో పాల్గొనవచ్చునని నిబంధన పెట్టారు. దీన్ని ఆమోదిస్తూ జలవనరులశాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. 

​​​​​​​- కోటపాడు–చానుబండ– విస్సన్నపేట ఎత్తిపోతల పనుల్ని ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు కట్టబెట్టడానికి జీవో 94కు విరుద్ధంగా ఏకంగా ఎనిమిది నిబంధనలను టెండర్‌ నోటిఫికేషన్‌లోచేర్చారు. ఎంపిక చేసిన కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టాక.. వాటికి జీవో 94 నుంచి సడలింపునిస్తూ 
జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. 
​​​​​​​- గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశ,వంశధార–బాహుదా నదుల అనుసంధానం నుంచి ముక్త్యాల ఎత్తిపోతల వరకూ 17 ప్రాజెక్టుల పనుల టెండర్లలోనూ ఇదే కథ కొనసాగింది. 

పనులన్నీ నలుగురు కాంట్రాక్టర్లకే 
2014కు ముందు సాగునీటి ప్రాజెక్టులకు పారదర్శకంగా టెండర్లు నిర్వహించడంవల్ల గరిష్టంగా 27 శాతం నుంచి కనిష్టంగా 8.77 శాతం లెస్‌(తక్కువ) ధరలకు పనులు చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకొచ్చారు. దీనివల్ల అప్పట్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదా అయ్యింది. కానీ ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలో 17 ప్రాజెక్టులకు నిర్వహించిన టెండర్లలో నలుగురు కాంట్రాక్టర్లకే రూ.18,648.71 కోట్ల విలువైన పనులు దక్కాయి. కాంట్రాక్టర్లు ముందే కుమ్మక్కు కావడంతో గరిష్టంగా 13.19 శాతం నుంచి కనిష్టంగా 3.52 శాతం ఎక్సెస్‌(అధిక) ధరకు కోట్‌ చేసి షెడ్యూళ్లను దాఖలు చేసి పనులు దక్కించుకున్నారు. సీఎం చంద్రబాబు కమీషన్ల కక్కుర్తి వల్ల ఖజానాకు భారీగా నష్టం చేకూరింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించిన టెండర్లను సీవోటీ రద్దు చేస్తుంది. అయితే సీవోటీ నిర్ణయం తీసుకోక ముందే.. టెండర్లలో పెట్టిన నిబంధనలకు జీవో 94 నుంచి సడలింపునిస్తూ జలవనరుల శాఖ కార్యదర్శితో ఉత్తర్వులు జారీ చేయించారు. దాంతో ఆ పనుల టెండర్లను సీవోటీ ఆమోదించింది. ఈ పనులను ఆగమేఘాలపై కాంట్రాక్టర్లకు కట్టబెడుతూ జలవనరులశాఖ ఒప్పందాలు చేసుకుంది. మొబిలైజేషన్‌ అడ్వాన్సులు ఇచ్చే దిశగా పావులు కదుపుతున్నారు. 

మరిన్ని వార్తలు