రగులుతున్న రగడ!

24 Jan, 2019 03:36 IST|Sakshi
ఉదయభాస్కర్, కారెం శివాజీ

ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఎదుట ఏపీపీఎస్సీ చైర్మన్‌ గైర్హాజర్‌

బ్యాక్‌లాగ్‌ పోస్టులు, రిజర్వేషన్ల అమలు విషయంలో పలు ఫిర్యాదులు

అట్రాసిటీ చట్టం కింద ఉదయభాస్కర్‌పై చర్యలకు కారెం శివాజీ యోచన

ఉదయభాస్కర్‌ 31న తమ ఎదుట హాజరు కావాలని మరోసారి నోటీసులు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కారెం శివాజీ, ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ మధ్య వివాదం రాజుకుంటోంది. బ్యాక్‌లాగ్‌ పోస్టులను నిబంధనల ప్రకారం భర్తీ చేయకపోవడం, రిజర్వేషన్‌ అభ్యర్థులను జనరల్‌ కేటగిరీలో మెరిట్‌ ప్రకారం తీసుకోవడం కుదరదని ఏపీపీఎస్సీ నిర్ణయించడంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పలు ఫిర్యాదులు అందాయి. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ప్రమోషన్‌ల విషయంలో రోస్టర్‌ పాటించడం లేదని ఫిర్యాదులున్నాయి. వీటిపై విచారించేందుకు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ గత నెలలో ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌కు నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసుల ప్రకారం ఈనెల 22వ తేదీన ఉదయభాస్కర్‌ కమిషన్‌ కార్యాలయంలో హాజరు కావాల్సి ఉండగా ఆయన రాకుండా కార్యాలయ సిబ్బందిని పంపించారు. వారు సరైన సమాచారంతో రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎస్సీ ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ ఈనెల 31న కమిషన్‌ ఎదుట హాజరు కావాలని ఉదయభాస్కర్‌ను అదేశిస్తూ మరోసారి నోటీసులు జారీ చేశారు. తమ నోటీసులను లెక్క చేయకుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం–1989 ప్రకారం చర్యలు చేపట్టాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ ఎస్టీ కమిషన్‌ వద్దకు వెళితే తన స్థాయి తగ్గుతుందని, అందువల్ల వెళ్లే ప్రశ్నే లేదని కొందరు ఏపీపీఎస్సీ అధికారులతో ఉదయ భాస్కర్‌ పేర్కొన్నట్లు సమాచారం.

రిజర్వేషన్ల చట్టానికి తూట్లు
విద్య, ఉద్యోగాల భర్తీలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, దివ్యాంగులకు రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మహిళలకు కూడా 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సి ఉంది. వీరంతా జనరల్‌ కేటగిరీలో మెరిట్‌ సాధిస్తే జనరల్‌లోనే ఎంపిక చేస్తారు. అయితే జనరల్‌ కేటగిరీలో రిజర్వేషన్‌ అభ్యర్థులను ఎంపిక చేసేది లేదని, రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించినా రిజర్వేషన్‌ కేటగిరీ అభ్యర్థులు రిజర్వేషన్‌ కేటగిరీలోనే ఎంపిక కావాల్సి ఉంటుందని ఏపీపీఎస్సీ నిబంధన పెట్టింది. ఇది ‘స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీసు రూల్స్‌ 1996, 22–ఏ’ నిబంధనకు విరుద్ధమని రిజర్వేషన్‌ కలిగిన అభ్యర్థులు పేర్కొంటున్నారు.

జనరల్‌ కోటాలో బ్యాక్‌లాగ్‌ పోస్టులు
ఈ సంవత్సరం ఏపీపీఎస్సీ విడుదల చేసిన ఉద్యోగాల భర్తీ ప్రకటనల్లో 225 ఎస్సీ, 257 ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టులను జనరల్‌ నోటిఫికేషన్‌తో కలిపి ఖాళీలు చూపించారు. జనరల్‌ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ కాని ఎస్సీ, ఎస్టీ పోస్టులకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్‌లు ఇచ్చి కేవలం ఆయా వర్గాలతో భర్తీ చేయాల్సి ఉంటుంది. జనరల్‌ కేటగిరీలో కలిపి అన్ని పోస్టులకు నోటిఫికేషన్‌ పిలవడం వల్ల కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్లకు అర్థం లేకుండా పోయిందని ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ వాదిస్తోంది. ఏపీపీఎస్సీ, ఇతర ప్రభుత్వ అధికారులకు నోటీసులు ఇవ్వగానే వెంటనే సీఎం పేషీ నుంచి కాస్త స్పీడు తగ్గించుకోవాలంటూ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ శివాజీకి ఫోన్లు వస్తున్నట్లు తెలిసింది.

తీరు మారకుంటే చట్టపరమైన చర్యలు..
ఏపీపీఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ తీరు మారకుంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. ఆయన విధానాల వల్ల పాలకులకు చెడ్డపేరు వస్తోంది. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది. రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన హక్కులను కాలరాయటంపై ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏపీపీఎస్సీ పట్ల ఆగ్రహంతో ఉన్నారు.  
– కారెం శివాజీ (రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌)

మరిన్ని వార్తలు