ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా

18 Sep, 2013 01:18 IST|Sakshi


 సాక్షి, మంచిర్యాల :
 జిల్లాలోని నిరుద్యోగులు, విద్యార్థులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛన్‌దారుల ఆశలు అడియాశలు అయ్యాయి. ప్రభుత్వం టెట్, డీఎస్సీ నోటిఫికేషన్ వేయకపోవడంతో రేయింబవళ్లు కష్టపడి చదివి ఉపాధ్యాయులు కావాలని కలలు కన్న నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఫలితంగా జిల్లాలో 34 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు.. ప్రభుత్వ తీరుతో ఎనిమిది వేల మంది పింఛన్‌దారులు, వేలాది మంది కార్మికులకు రావాల్సిన మధ్యంతర భృతి నిలిచింది. పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి గ్రహణం పట్టింది. దీంతోపాటు ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లోని వివిధ పోస్టుల భర్తీకి జనవరిలో తీసుకున్న నిర్ణయం కాగితాలకే పరిమితమైంది. ఈ పోస్టులు భర్తీ అయితే.. జిల్లాలో వందలాది మంది నిరుద్యోగులకు ప్రభుత్వ కొలువులు వరిస్తాయి.
 
 అందని మధ్యంతర భృతి
 ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛన్‌దారులతోపాటు కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం 22 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని నిర్ణయించింది. జూలై నుంచి ఈ భృతి అందాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఇవ్వడం లేదు. జిల్లాలోని ప్రభుత్వ శాఖల్లో 34,803 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 8 వేలకు పైగా మంది పెన్షనర్లు, వేలాది మంది కార్మికులు ఉన్నారు. మధ్యంతర భృతి కోసం వీరందరూ నిరీక్షిస్తున్నారు.
 
 గ్రామ కార్యదర్శుల భర్తీపై నీలినీడలు
 గ్రామ పాలనలో కీలక పాత్ర పోషించే గ్రామ కార్యదర్శుల పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది సంఖ్యలో ఖాళీగా ఉన్నా యి. కేవలం మన జిల్లాలో 641 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 866 గ్రామ పంచాయితీల్లో కేవలం 225 మంది పంచాయతీ కార్యదర్శులు మాత్రమే రెగ్యూలర్‌గా ఉన్నారు. 641 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రవ్యాప్తంగా 2,641 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి ఏప్రిల్‌లోనే ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆగస్టులో నోటిఫికేషన్ విడుదలై నవంబర్‌లోగా పోస్టులు భర్తీ అవుతాయని నిరుద్యోగులు భావించారు. కానీ ఇంత వరకు ఆ పోస్టుల నోటిఫికేషన్ విడుదల కాలేదు. మరోపక్క.. పంచాయతీ కార్యదర్శుల ఖాళీల కొరతతో.. ఇప్పటికే  పన్ను వసూళ్లు లక్ష్యం మేరకు జరగడం లేదు.
 
 ఊరిస్తున్న డీఎస్సీ
 2013 డీఎస్సీ నిర్వహించి.. రాష్ట్రవ్యాప్తంగా 20,508 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్, అప్పటి పాఠశాల విద్యా డెరైక్టర్ (ఎఫ్‌ఏసీ) ఉషారాణి జూలై 2న ప్రకటించారు. ఈ క్రమంలో జిల్లాలో 93 స్కూల్ అసిస్టెంట్లు, 60 భాషాపండితులు, 983 ఎస్జీటీలు,  5 పీఈటీలు మొత్తం 1,141 పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తులు స్వీకరించి.. అక్టోబర్ 9,10,11 తేదీల్లో డీఎస్సీ నిర్వహిస్తామని.. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఇప్పటివరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడంతో జిల్లాలోని ఏడు వేలకు పైగా నిరుద్యోగ అభ్యర్థులు డీఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సందర్భంలో ఆగస్టు 25న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. కానీ సీమాంధ్రుల ఉద్యమం నేపథ్యంలో నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు. తెలంగాణవాదులకు సీమాంధ్రులు ఈ రకంగా కూడా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
 విలువైన విద్యా సంవత్సరం వృథా
 డిగ్రీ పూర్తి చేసి బీఎడ్ చేయాలని.. ఇంటర్మీడియట్ తర్వాత టీటీసీ(డీఎడ్) చే యాలని జిల్లా వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. జూన్ 4న బీఈడీ అర్హత పరీక్ష జరిగింది. సుమారు 10 వేల మంది పరీక్ష రాశారు. జూలైలో ఫలితాలు విడుదలయ్యాయి. మే 31న టీటీసీ పరీక్ష జరిగింది. 18,041 మంది పరీక్ష రాశారు. జూన్ 17న ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రెండు కోర్సులకు సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో కౌన్సెలింగ్ పూర్తి చేయాల్సి ఉం ది. ఇంతవరకు కౌన్సెలింగ్ తేదీలే ఖరారు కాలేదు.
 
 ఆందోళనలో ఎంతో మంది..
 - పిట్టల సృజన్, విద్యార్థి, చెన్నూరు
 టీటీసీలో 159 ర్యాంకు వచ్చింది. సీటు కచ్చితంగా వస్తుంది. కానీ సీట్ల భర్తీ కౌన్సెలింగ్ తేదీ ప్రకటించలేదు.   సీమాంధ్ర ఉద్యమం వల్ల కౌన్సెలింగ్ తేదీ ప్రకటించలేదని అనుకుంటున్నాను. పరిస్థితి ఇలానే ఉంటే విలువైన విద్యా సంవత్సరం కోల్పోతానని ఆందోళనగా ఉంది.

మరిన్ని వార్తలు