ఆగస్టులో నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ కసరత్తు..

29 Jul, 2013 17:05 IST|Sakshi
ఆగస్టులో నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ కసరత్తు..

- పరీక్షల షెడ్యూల్ విడుదలపై సన్నాహాలు
- ఎన్నికల కోడ్‌లతో ఉద్యోగాల భర్తీకి ఇబ్బంది
- గ్రూపు-1, 2 నోటిఫికేషన్లు కొన్నాళ్ల తరువాతే!

వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీని ఆగస్టులో ప్రారంభించేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 12 వేలకు పైగా భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన నేపథ్యంలో నోటిఫికేషన్ల జారీకి అవసరమైన చర్యల్లో నిమగ్నమైంది. పోస్టులవారీగా రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల వివరాలను సంబంధిత శాఖల నుంచి తెప్పించే చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరుకే పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లను జారీ చేయాలని ఏపీపీఎస్సీ గతంలో భావించినా గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ప్రకటన ఆలస్యమైంది.

జూలై 31వ తేదీతో ఎన్నికల కోడ్ ముగియ నుండడంతో ఆగస్టులో నోటిఫికేషన్ల జారీపై ఏపీపీఎస్సీ దృష్టి సారించింది. ఇప్పటికే తమ వద్ద అన్ని క్లియరెన్స్‌లు ఉన్న పోస్టులతోపాటు ఆర్థికశాఖ ఆమోదించిన పోస్టుల్లో అన్ని అనుమతులు, ఇండెంట్లు వచ్చిన పోస్టులకు సాధ్యమైనంత త్వరగా నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తోంది. మరోవైపు ఆగస్టులోనే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో ఆ లోగానే అన్నీ క్లియర్‌గా ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా మొదట 2,677గ్రామ పంచాయతీ కార్యదర్శి పోస్టులతోపాటు అందుబాటులో ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

పరిమిత పోస్టులతోనే గ్రూపు-1, 2 నోటిఫికేషన్లు?
గ్రూపు-1, గ్రూపు-2 లాంటి ప్రధాన పోటీ పరీక్షల నోటిఫికేషన ్ల జారీకి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. ఆర్థికశాఖ అనుమతించిన ఈ కేటగిరీల్లోని పోస్టులకు సంబంధించి వివిధ శాఖల నుంచి ఇండెంట్లు, రోస్టర్ పాయింట్లు అందకపోవడమే దీనికి కారణంగా కనిపిస్తోంది. మరోవైపు ఈ కేటగిరీల్లోని కొన్ని పోస్టులు ఇంకా ఆర్థికశాఖ పరిశీలనలోనే ఉండటంతో ఈ నోటిఫికేషన్ల జారీలో జాప్యం తప్పేలా లేదు. అయితే అధికారులు మాత్రం తమ వద్ద అందుబాటులో ఉన్న పోస్టులతోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు జారీ చేయాలని భావిస్తున్నారు. అక్టోబర్‌లో గ్రూప్-1, నవంబర్‌లో గ్రూప్-2 రాత పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే పరిమిత పోస్టులతోనే గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ కానుంది.

ఆర్థికశాఖ పరిశీలనలో పలు పోస్టులు
ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టుల్లో మొదట 11 వేల పోస్టులకు అనుమతి ఇచ్చిన ఆర్థికశాఖ ఈనెల 2వ తేదీన మరో 1,127 పోస్టులకు ఆమోదం తెలిపింది. అయితే అందులో గ్రూపు-1, గ్రూపు-2 కేటగిరీల్లోని డిప్యూటీ తహసీల్దార్ లాంటి కొన్ని కేటగిరీ పోస్టులకే అనుమతి ఇచ్చింది. అవి కాకుండా ఇంకా 24 సబ్ రిజిస్ట్రార్, 99 అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (ఏసీటీఓ), 10 మున్సిపల్ గ్రేడ్-3 కమిషనర్, 184 కోఆపరేటివ్ సబ్ రిజిస్ట్రార్ పోస్టులు ఆర్థికశాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. గ్రూపు-1 కేటగిరీలో 33 కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ (సీటీఓ), 8 గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులతో మరికొన్ని కేటగిరీలకు చెందిన పోస్టులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు గ్రూపు-2, గ్రూపు-4 కేటగిరీల్లోని ఒకే రకమైన పోస్టులకు ఒకే పరీక్ష ద్వారా భర్తీ చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.

వరుస ఎన్నికలతో షెడ్యూల్ సాధ్యమయ్యేనా?
సంస్కరణల్లో భాగంగా వివిధ పోస్టుల భర్తీకి పరీక్షల షెడ్యూల్ జారీ చేసి వార్షిక కేలండర్‌ను అమలు చేసేందుకు ఏపీపీఎస్సీ కసరత్తు చేసింది. అయితే ప్రస్తుతం వరుస ఎన్నికల నేపథ్యంలో ఒకదాని తరువాత మరొకటి ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఈ పరిస్థితుల్లో పోటీ పరీక్షల షెడ్యూలు జారీ చేయడం, దాని ప్రకారం నోటిఫికేషన్ల జారీ, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి లాంటి చర్యలు చేపట్టడం సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కోడ్ ముగిసిన తరువాతైనా..
జూలై 31వ తేదీ వరకు పంచాయతీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, ఆగస్టులో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైతే మళ్లీ ఎన్నికల కోడ్ అమల్లోకి రానుండటం, ఆ తరువాత కూడా నవంబరు నాటికి సాధారణ ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో ఈ ఆందోళన నెలకొంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో లేని తేదీల్లో పరీక్షల షెడ్యూ ల్ జారీ చేస్తే... ఆ తరువాత కోడ్ అమల్లోకి వచ్చినా నోటిషికేషన్ల జారీ, పరీక్షల నిర్వహణకు ఇబ్బందులు ఎదురుకావని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు