ఆర్టీసీ చిల్లర దోపిడీ

22 Jun, 2018 09:24 IST|Sakshi

క్యాట్‌ ప్రయాణం పెనుభారం

చార్జీల సవరణ పేరుతో టోపీ

నేటి నుంచి ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో అమలు

జూలై 1 నుంచి పల్లెవెలుగు బస్సుల్లో..

అనంతపురం(న్యూసిటీ)/కదిరి: ఆర్టీసీ ప్రయాణికుల నుంచి చిల్లర దోపిడీకి చంద్రబాబు సర్కార్‌ దిగుతోంది. చార్జీల సవరణ పేరుతో అదనపు భారం మోపుతోంది. సవరించిన చార్జీలు ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్సుల్లో శుక్రవారం(నేటి)నుండి అమలులోకి రానున్నాయి. పల్లెవెలుగు బస్సుల్లో వచ్చే నెల 1 నుంచి అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.

రోజుకు 13 లక్షల మంది ప్రయాణికులు
జిల్లాలో మొత్తం 13 ఆర్టీసీ డిపోలు ఉండగా, 780 బస్సులు రోజుకు 13 లక్షల మంది ప్రయాణికులను వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నాయి. ప్రయాణికుల నుంచి ఆర్టీసీకి రోఉకు రూ. 2 కోట్ల ఆదాయం వస్తోంది. సవరించిన ఎక్స్‌ప్రెస్, లగ్జరీ బస్‌ చార్జీల ద్వారా రోజుకు రూ.13 నుంచి రూ.15 లక్షలు వరకు ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. జూలై 1 నుంచి పల్లె వెలుగు బస్సుల్లోనూ చార్జీల సవరణ అమలులోకి వస్తే జిల్లా ప్రయాణికులపై రూ.50 లక్షలు దాకా రోజుకు అదనపు భారం పడనుంది.

క్యాట్‌ కార్డుపై అదనపు భారం
క్యాట్‌ కార్డు ఉన్న వారిపై  చార్జీల భారం మరింత కానుంది. రూ. 84 చార్జీలున్న ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో సవరణ తర్వాత రూ.85కు చార్జీలు పెరుగుతాయి. ఇప్పటి వరకు రూ. 84 చార్జీపై క్యాట్‌ కార్డు ఉన్నవారితో రూ. 76 మాత్రమే వసూలు చేస్తూ వచ్చారు. అంటే క్యాట్‌ కార్డుదారు ఒకసారి ప్రయాణిస్తే రూ. 8 వరకు ఆదా ఉండేది. చార్జీల సవరణ తర్వాత ఇది రూ.80కి చేరుకుంటుంది. అంటే దాదాపు మూడు రూపాయలను క్యాట్‌ కార్డు నష్టపోనున్నాడు. ఇన్నాళ్లూ 10 స్టేజీల వరకు పల్లె వెలుగులో 50 కి.మీ ప్రయాణిస్తే రూ.32 తీసుకునేవారు. సవరిస్తే రూ.30 తీసుకుంటారు.

అదే క్యాట్‌ కార్డు ఉన్నవారికి 10 స్టేజీల వరకూ రూ.15 మాత్రమే తీసుకునే వారు. జూలై 1 నుంచి రూ.27 తీసుకుంటారు. 44 స్టేజీల వరకు అంటే 220 కి.మీ పల్లె వెలుగులో ప్రయాణిస్తే ఇన్నాళ్లూ రూ.137 తీసుకునే వారు. చార్జీలు సవరిస్తే రూ.140 తీసుకుంటారు. అదే క్యాట్‌ కార్డు ఉన్నవారికి ఇన్నాళ్లూ రూ.70 మాత్రమే తీసుకునే వారు. సవరిస్తే వారి నుండి రూ.126 తీసుకుంటారు. ఇప్పటికే రూ.250 ఉన్న క్యాట్‌ కార్డు ధరను రూ.300కు పెంచిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు