విద్యుత్‌ బిల్లుల విధానాన్ని సరళతరం చేశాం

20 Jun, 2020 05:22 IST|Sakshi

వినియోగదారులు ఎంత వాడుకుంటే అంతే చెల్లించేలా మార్పులు చేశాం

హైకోర్టుకు నివేదించిన ఏపీఎస్‌పీడీసీఎల్‌

సాక్షి, అమరావతి: వినియోగదారులకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతో విద్యుత్‌ బిల్లుల విధానాన్ని చాలా సరళతరం చేశామని ఆంధ్రప్రదేశ్‌ దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్‌) హైకోర్టుకు నివేదించింది. ఎంత వాడుకుంటే అంతే బిల్లు చెల్లించేలా కేటగిరీల వారీగా మార్పులు చేశామని తెలిపింది. గతంలో కొన్ని కేటగిరీల్లో తక్కువ విద్యుత్‌ వాడుకున్నప్పటికీ, ఏడాది మొత్తం వాడుకున్న యూనిట్ల ప్రకారం చెల్లింపులు చేయాల్సి వచ్చేదని, ఇప్పుడు దాన్ని మార్చామని వివరించింది. దీనివల్ల విద్యుత్‌ వినియోగదారులపై ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొంది. లాక్‌డౌన్‌ వల్ల మార్చి విద్యుత్‌ రీడింగ్‌ను ఏప్రిల్‌లో తీసుకోవడం సాధ్యం కాలేదంది. కొందరు వినియోగదారులు 24 గంటల పాటు విద్యుత్‌ను వినియోగించడంతో మార్చిలో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిందని తెలిపింది.

ఏప్రిల్‌ నుంచి మేలో రీడింగ్‌ నమోదు చేసేంత వరకు 2020–21 ఆర్థిక సంవత్సరానికి ఏపీ విద్యుత్‌ నియంత్రణ మండలి నిర్దేశించిన రేట్ల ప్రకారం బిల్లులు జారీ చేశామంది. అధిక మొత్తాలను వసూలు చేస్తున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదంది. ఎటువంటి వడ్డీ, అపరాధ రుసుం లేకుండా బిల్లు చెల్లింపు గడువును జూన్‌ 30 వరకు ఇచ్చామని తెలిపింది. బిల్లుల విషయంలో సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌ కూడా ఇచ్చామని వివరించింది. నెలకు 75 యూనిట్ల కంటే తక్కువ వినియోగం ఏ కేటగిరీ, 75 నుంచి 225 యూనిట్ల వరకు బీ కేటగిరీ, 225 యూనిట్లకు పైన సీ కేటగిరీగా నిర్ణయించామంది.

ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని కోరింది. కొత్త విద్యుత్‌ టారిఫ్‌ను సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎం.శ్రీనివాసరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని విద్యుత్‌ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు తిరుపతి ఏపీఎస్‌పీడీసీఎల్‌ చైర్మన్, ఎండీ హరనాథ్‌రావు పై వివరాలతో కౌంటర్‌ దాఖలు చేశారు.  

మరిన్ని వార్తలు