ఏపీఎస్‌ ఆర్టీసీకి దసరా ధమాకా

14 Oct, 2019 04:55 IST|Sakshi

పండుగ సీజన్‌లో ఆదాయం 229 కోట్ల రూపాయలు

గత ఏడాది కంటే రూ.20 కోట్లు అధికంగా ఆర్జన 

ఆక్యుపెన్సీ రేషియో 103 శాతం 

5,887 ప్రత్యేక సరీ్వసులు నడిపిన ఆర్టీసీ అధికారులు

సాక్షి, అమరావతి: దసరా సీజన్‌లో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ(ఏపీఎస్‌ఆర్టీసీ) భారీగా ఆదాయం ఆర్జించింది. ఈ సీజన్‌లో మొత్తం రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. గతఏడాది దసరా సీజన్‌ కంటే ఈసారి రూ.20 కోట్లు అధికంగా రావడం గమనార్హం. 2018 దసరా సమయంలో రూ.209 కోట్లు, ఈసారి రూ.229 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ పండక్కి ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఆక్యుపెన్సీ రేషియో(ఓఆర్‌) ఏకంగా 103 శాతంగా నమోదైంది.

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులకు ఆదరణ మరింత పెరిగింది. మొత్తం పండగ సీజన్‌లో సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 13వ తేదీ వరకు రెగ్యులర్‌ సర్వీసులతో పాటు అదనంగా 5,887 ప్రత్యేక బస్సులను తిప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ గణనీయమైన ఆదాయాన్ని రాబట్టింది. ప్రత్యేక సర్వీసుల్లో 50 శాతం అధిక ఛార్జీలు వసూలు చేసి.. ప్రణాళికాబద్ధంగా సర్వీసులు నడపడంతో మంచి రాబడి లభించింది. ఏపీఎస్‌ఆర్టీసీకి ప్రతిరోజూ సాధారణంగా రూ.13 కోట్ల ఆదాయం ఛార్జీల రూపంలో వస్తుంది. ఆర్టీసీ బస్సుల్లో నిత్యం 71 లక్షల మంది ప్రయాణిస్తారు.

కలిసొచ్చిన టీఎస్‌ ఆర్టీసీ సమ్మె
దసరా సీజన్‌ ఆరంభంలోనే తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఈ అవకాశాన్ని ఏపీఎస్‌ఆర్టీసీ చక్కగా వినియోగించుకుంది. ఇదే సమయంలో తెలంగాణ నుంచి విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీ అధికారులు అన్ని రీజియన్ల నుంచి ప్రత్యేక సర్వీసులను నడిపారు. హైదరాబాద్‌లో ఈడీ స్థాయి అధికారిని అందుబాటులో ఉంచి, అక్కడి నుంచి రెగ్యులర్‌ సర్వీసులతోపాటు ప్రత్యేక బస్సులను తిప్పారు. ప్రతిరోజూ దాదాపు 40 వేల మంది ఏపీఎస్‌ఆర్టీసీ ఆన్‌లైన్‌ సేవలను వినియోగించుకుంటారు. దసరా పండుగ సమయంలో ఈ సంఖ్య 75 వేలకు చేరింది.


 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా