ఆర్టీసీకి నాలుగు జాతీయ అవార్డులు

22 Mar, 2016 20:27 IST|Sakshi

- బెంగుళూరులో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ నుంచి ఎండీ స్వీకరణ

హైదరాబాద్‌ :  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు (ఏపీఎస్‌ఆర్‌టీసీ) ప్రతిష్టాత్మక అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్టు అండర్ టేకింగ్స్ (ఎఎస్‌ఆర్‌టీయూ) నుంచి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. 2014-15 సంవత్సరానికిగాను గ్రామీణ సర్వీసులలో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల సాధించినందుకు, అతి తక్కువ ఆపరేషనల్ (పన్ను ఎలిమెంట్ లేకుండా కి.మీ.కు 26.02 రూపాయలు వ్యయం) కలిగి ఉన్నందుకు ఆర్టీసీకి ఈ అవార్డులు లభించాయి. మంగళవారం బెంగుళూరులో జరిగిన ఎఎస్‌ఆర్‌టీయూ 60వ వార్షికోత్సవ సభలో ఆర్టీసీ ఎండీ ఎన్.సాంబశివరావు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకున్నారు.

గ్రూపు-1 కేటగిరీ మొఫిసిల్ (గ్రామీణ) సర్వీసుల్లో విన్నర్ అవార్డు, ఇంధన వినియోగంలో అత్యధిక కె.ఎం.పి.ల్. (5.23) సాధించినందుకు, గ్రామీణ సర్వీసుల్లో వాహన ఉత్పాదకతలో గరిష్ట పెరుగుదల (వాహనం రోజుకు నడుపుతున్న కిలోమీటర్లు 320.59 నుంచి 381.19 వరకు పెరుగుదల) సాధించినందుకు విన్నర్ అవార్డులు ఆర్టీసీ సాధించింది. వీటితో పాటు సెక్రటేరియల్ సామర్ధ్యంలో మరో అవార్డు కూడా దక్కింది. ఈ అవార్డులు ఆర్టీసీకి లభించడం పట్ల సంస్థ ఎండీ సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. కార్మికుల అంకితభావం, సూపర్‌వైజర్లు, అధికారులు, సిబ్బంది అంతా కలిసికట్టుగా చేసిన కృషి దాగి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు