పెరిగిన బస్సు చార్జీలు రేపటి నుంచే

10 Dec, 2019 16:35 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ ఆర్టీసీ) బస్సు చార్జీల పెంపు రేపటి నుంచి అమల్లోకి రానుంది. ఈ మేరకు సవరించిన చార్జీలతో ఏపీఎస్‌ ఆర్టీసీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. పెంచిన చార్జీలు రేపు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని అందులో పేర్కొంది. పల్లెవెలుగు బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు, ఎక్స్‌ప్రెస్‌, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ బస్సుల్లో కిలోమీటర్‌కు 20 పైసలు పెంచుతున్నట్టు ప్రకటనలో తెలిపింది.
(చదవండి : ఆర్టీసీకి ఆక్సిజన్‌ అందించేందుకే.. )

వీటితోపాటు ఇంద్ర ఏసీ, గరుడ, అమరావతి బస్సుల్లో కిలోమీటర్‌కు 10 పైసలు చార్జీ పెంపు ఉంటుందని సంస్థ వెల్లడించింది. వెన్నెల స్లీపర్ బస్సుల్లో చార్జీల పెంపు లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. అలాగే, సిటీఆర్డినరీ బస్సుల్లో 11 స్టేజీల వరకు చార్జీల పెంపుదల లేదని ఆర్టీసీ తెలిపింది. పల్లెవెలుగులో మొదటి 2 స్టేజీలు.. అనగా 10 కిలోమీటర్ల వరకు చార్జీల పెంపు లేదని పేర్కొంది. తదుపరి 75 కిలోమీటర్ల వరకు రూ.5 ఛార్జీ పెంపు ఉంటుందని ఆర్టీసీ పేర్కొంది.
(చదవండి : అందుకే ఆర్టీసీ బస్సు చార్జీల పెంపు: పేర్ని నాని)

ఇంధన ధరల పెంపువల్లే.. 
డీజిల్‌ ధరలు గత నాలుగేళ్లలో రూ.49 నుంచి రూ.70కి పెరిగాయని ఆర్టీసీ తన ప్రకటనలో వెల్లడించింది. ఇంధన ధరల పెరుగుదల వల్ల సంస్థపై ఏటా రూ.630 కోట్ల అదనపు భారం పడుతోందని తెలిపింది. విడిభాగాలు, సిబ్బంది జీతభత్యాల వల్ల ఏటా మరో రూ.650 కోట్ల భారం సంస్థపై పడుతోందని పేర్కొంది. నష్టాన్ని భర్తీ చేసేందుకే బస్సు చార్జీలు పెంచామని ఆర్టీసీ తెలిపింది.

మరిన్ని వార్తలు