ప్రయాణాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ సిద్ధం: పేర్ని నాని

18 May, 2020 12:48 IST|Sakshi

ప్రజా రవాణాపై సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారు

సాక్షి, విజయవాడ:  ప్రజా రవాణాపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకుంటారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రాగానే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను పునఃప్రారంభించేందుకు ఆర్టీసీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. రాష్ట్రాల మధ్య, రాష్ట్రం లోపల బస్సులు నడిపేందుకు అన్ని జాగ్రత్తలతో ఏర్పాట్లు చేశామని మంత్రి పేర్ని నాని తెలిపారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర నిబంధనలు, రాష్ట్రంలో పరిస్థితుల అనుగుణంగా బస్సులు నడుపుతామని తెలిపారు. (కర్నూలులో 403 మంది కరోనా విజేతలు)

వాహన మిత్ర పథకం ఇంటికొకరికి మాత్రమే..
విజయవాడలో సోమవారం వైఎస్సార్‌ వాహనమిత్ర కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ.. వాహన మిత్ర పథకం ఇంటికొకరికి మాత్రమే వర్తిస్తుందని, రెండో ఏడాది పథకం అమలుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ఓనర్‌ కమ్‌ డ్రైవర్లకు రూ.10వేలు ఆర్థిక సాయం ఇస్తున్నామని తెలిపారు. గత ఏడాది 2,36,334 మందికి ఆర్ధిక సహాయం ఇచ్చామని, రెండవ ఏడాది పథకం జూన్ 4 తేదీన సీఎం జగన్ ప్రారంభిస్తారని పేర్కొన్నారు. కొత్తగా అప్లయ్‌ చేసుకునేవాళ్లు ఈ నెల 18 నుంచి 26 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. జూన్‌ 1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, దరఖాస్తులు ప్రతి సచివాలయంలో అందుబాటులో ఉంటాయన్నారు. గత ఏడాది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని, వారికి సోషల్‌ ఆడిట్‌ జరుగుతోందన్నారు. (హలో.. హ్యాపీ జర్నీ)

తప్పుడు ప్రచారం చేస్తున్నారు
ఆర్టీసీలో ఒక్క ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని కూడా తొలగించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది విషయంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారికి కోవిడ్ ఇన్సూరెన్స్ లేనందునే కొన్ని రోజులు విధులకు దూరంగా ఉంచామన్నారు. ఉద్యోగుల్ని ఎక్కడా తొలగించలేదని, తొలగించినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.  కోవిడ్ స్టేట్ లెవల్‌ కో ఆర్డినేటర్‌ కృష్ణబాబు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో వలస కార్మికులను మాత్రమే తరలిస్తున్నామని, అన్నిజాగ్రత్తలు తీసుకున్నాకే ప్రయాణాలకు అనుమతి ఇస్తున్నామన్నారు.

మరిన్ని వార్తలు