కారుణ్య నియామకాలకు ఆర్టీసీ ఓకే..

6 Jan, 2019 07:50 IST|Sakshi

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాలకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎట్టకేలకు పచ్చజెండా ఊపింది. దశలవారీగా నియామకాలు చేపట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు కారుణ్య నియామకాల కింద వచ్చిన 1,065 దరఖాస్తుల్ని ఆర్టీసీ పెండింగ్‌లో ఉంచింది. ఈ పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను ఐదు దఫాల్లో భర్తీ చేసేందుకు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ఎన్వీ సురేంద్రబాబు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. సర్వీసులో ఉండి మృతి చెందిన ఉద్యోగుల పిల్లలు ఎవరైనా డ్రైవర్, శ్రామిక్, కండక్టర్‌ పోస్టులకు అర్హత కలిగి ఉంటే ఉద్యోగాలు కల్పిస్తారు. ఈ మేరకు ఆయా రీజియన్ల పరిధిలోని డిపో మేనేజర్లు స్క్రూట్నీ నిర్వహించి అర్హత గల అభ్యర్థుల జాబితాను ఆయా రీజియన్‌ మేనేజర్లకు పంపించాలని యాజమాన్యం ఆదేశాలిచ్చింది.

ఈ నెల 18లోగా అర్హులైన అభ్యర్థుల జాబితాను సంస్థ చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌కు పంపించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, ఆర్టీసీ కార్మికుల పట్ల యాజమాన్యం అనుసరిస్తున్న ఏకపక్ష వైఖరికి నిరసనగా, 50 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ ఎంప్లాయీస్‌ యూనియన్‌ గత నెలలో సమ్మె నోటీసు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రధాన డిమాండ్లలో ఒకటైన కారుణ్య నియామకాల భర్తీని చేపట్టాలని యాజమాన్యం నిర్ణయించడం గమనార్హం.  

నాలుగున్నరేళ్లుగా నిలిపివేత..
ఎవరైనా ఉద్యోగి సర్వీసులో ఉండగా అర్ధాంతరంగా మరణిస్తే.. వారి కుటుంబం రోడ్డున పడకుండా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆర్టీసీలో 1978 నుంచి కారుణ్య నియామకాలు ప్రవేశపెట్టారు. అయితే గతంలో చంద్రబాబు హయాంలోనూ 1996–2000వ సంవత్సరం వరకు కారుణ్య నియామకాలకు బ్రేకులేశారు. మళ్లీ 2014లో అధికారంలోకొచ్చిన చంద్రబాబు సర్కార్‌ కారుణ్య నియామకాలను నిలిపివేసింది. ఆర్టీసీలో సిబ్బంది అధికంగా ఉన్నారనే సాకుతో ఈ నియామకాలను పక్కనపెట్టేశారు. మరోవైపు నిబంధనల పేరుతో 140 మంది మహిళా అభ్యర్థులను సైతం ఇబ్బందులు పెడుతున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. సాధారణంగా ఆర్టీసీలో కారుణ్య నియామకాల కింద డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, సెక్యూరిటీ గార్డుల పోస్టులివ్వాలని నిబంధన ఉంది.

క్లరికల్‌ పోస్టులకు అనుమతి లేదు. అయితే మహిళా అభ్యర్థుల విషయంలో తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం చొరవ చూపించి ఉద్యోగాలిస్తోంది. రాష్ట్రంలో కూడా ఆ విధంగా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న ఆర్టీసీ యాజమన్యం నిర్లక్ష్య తీరును నిరసిస్తూ యూనియన్లు సమ్మె నోటీసిచ్చాయి. దీంతో స్పందించిన యాజమాన్యం ఎట్టకేలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.    

వారి పరిస్థితేంటి?
ఉద్యోగి చనిపోతేనే కాదు.. మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన కూడా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని 2015లో ఆర్టీసీ యాజమాన్యం సర్క్యులర్‌ జారీ చేసింది. అయితే మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన ఉద్యోగుల వారసులు 200 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిని కూడా కాళ్లరిగేలా తిప్పుకుంటున్నారే తప్ప ఉద్యోగాల ఊసెత్తడం లేదు. ఇక కారుణ్య నియామకం కింద ఉద్యోగం వద్దనుకునే వారికి ఆర్టీసీ కొంత మొత్తం అందించాలి. 3, 4వ తరగతి ఉద్యోగి అయితే వారి కుటుంబానికి రూ.లక్ష, రెండో తరగతి అంటే సూపర్‌వైజర్‌గా పనిచేసే ఉద్యోగి కుటుంబానికి రూ.1.25 లక్షలు, అధికారి కేడర్‌ అయితే రూ.1.50 లక్షలు అందించే వీలుంది. ఇలా ఉద్యోగం వద్దనుకున్న వారికి ఇవ్వాల్సిన సొమ్ము కూడా చెల్లించకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు కార్మిక సంఘాల నుంచి వినిపిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు