ఇదేమి బాదుడు దేవుడా?

30 Nov, 2018 14:29 IST|Sakshi

పుణ్యక్షేత్రాల సందర్శనకు తప్పని ఆర్టీసీ భారం

ప్రయాణికుల నుంచి రెట్టింపు చార్జీలు వసూలు

ఉద్దేశ పూర్వకంగానే రెగ్యులర్‌ సర్వీసులు రద్దు

ప్రత్యేక సర్వీసుల పేరుతో భారీగా వడ్డన

కొత్త సినిమా బ్లాక్‌ టిక్కెట్లను తలపిస్తున్న వైనం

వివిధ సెస్సుల పేరిట ఏటా రూ.500 కోట్లు వసూలు

ఏపీలో కంటే తెలంగాణలోనే ఆర్టీసీ చార్జీలు తక్కువ

విజయవాడకు చెందిన సురేష్‌ కార్తీక మాసంలో కుటుంబంతో కలిసి ఈ నెల 25న అన్నవరం దర్శనానికి వెళ్లాడు. రాజమండ్రికి చేరుకుని అక్కడి నుంచి అన్నవరం వెళ్లేందుకు రాజమండ్రి డిపోకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీ అల్ట్రా డీలక్స్‌ బస్సు ఎక్కాడు. రాజమండ్రి నుంచి అన్నవరం వరకు 80 కిలోమీటర్ల దూరం. టోల్‌ చార్జీలు, ప్యాసింజర్‌ సెస్సు కలిపి టిక్కెట్టు ధర రూ.వంద వరకు ఉంది. కానీ రూ.150 వంతున వసూలు చేశారు. ఆరుగురు కుటుంబ సభ్యులకు రూ.900 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇదేమిటని ప్రశ్నిస్తే ప్రభుత్వం నిర్ణయించిన ధర అంతేనని సమాధానమిచ్చారు. తిరుగు ప్రయాణంలో అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్లేందుకు ఖమ్మం డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు ఎక్కారు. టోల్‌ చార్జీ, సెస్సుతో కలుపుకుని ఒక్కొక్కరికి రూ.79 చొప్పున రూ.395 మాత్రమే అయింది. తెలంగాణ ఆర్టీసీ కంటే ఏపీఎస్‌ ఆర్టీసీలో రెట్టింపు ధర కంటే ఎక్కువగా ఉండటంతో ఆశ్చర్యపోవడం సురేష్‌ వంతైంది.  

సాక్షి, అమరావతి : రద్దీ, పండగ సీజన్‌లలో ప్రయాణికులపై ఏపీఎస్‌ ఆర్టీసీ తీవ్ర భారం మోపుతోంది. కొత్త సినిమాకు బ్లాక్‌లో టికెట్లు అమ్మినట్లు 50 శాతం చార్జీలను అధికంగా వసూలు చేస్తోంది. డిపోల వారీగా ఇష్టానుసారం బాదేస్తోంది. పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ వదలకుండా వారి జేబులను ఖాళీ చేస్తోంది. డీజిల్‌ ధరలు పెరిగినా చార్జీలు పెంచడం లేదని పైకి చెబుతూ.. జిల్లా జిల్లాకో రీతిన టిక్కెట్ల ధర పెంచి డబ్బులు లాగేస్తోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇప్పటికే ఆర్టీసీ రెండుసార్లు చార్జీలను పెంచింది. సవరణల పేరిట ప్రతి సీజన్‌లోనూ అదనపు చార్జీలను వడ్డిస్తూనే ఉంది. దీనికి తోడు ప్యాసింజర్‌ సెస్సు, సేఫ్టీ సెస్సు అంటూ ఏటా ప్రయాణికులపై రూ.500 కోట్ల అదనపు భారం మోపుతోంది. టోల్‌ చార్జీలు పెరిగినప్పుడల్లా ప్రయాణికులకు వాత తప్పడం లేదు. ఇక పండగ వేళల్లో అయితే ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రత్యేక బస్సులంటూ 50 శాతం నుంచి వంద శాతం వరకు చార్జీలను పెంచుతూ ఏకంగా ప్రజా రవాణా వ్యవస్థను ప్రజలకు దూరం చేస్తోందని పేదలు వాపోతున్నారు.  

ప్రత్యేక బస్సులతో జిల్లాకో రకంగా దోపిడీ
ఆర్టీసీ రద్దీ వేళల్లో రెగ్యులర్‌ సర్వీసులు నిలిపేసి ప్రత్యేక బస్సులను ప్రవేశపెడుతోంది. ఈ బస్సుల్లో రెగ్యులర్‌ బస్‌ చార్జీల కంటే 50 శాతం అధికంగా టిక్కెట్లు వసూలు చేస్తోంది. అదేమంటే ప్రత్యేక బస్సులు తిరిగి వచ్చేటప్పుడు ఖాళీగా రావాల్సి ఉంటుందని ఆర్టీసీ అధికారులు సాకు చెబుతున్నారు. రాజమండ్రి నుంచి అన్నవరం వెళ్లేందుకు అల్ట్రా డీలక్స్‌లో కిలోమీటరుకు రూపాయి పది పైసలు వంతున వసూలు చేయాలి. అంటే టిక్కెట్టు ధర 80 కిలోమీటర్లకు గాను టిక్కెట్టు ధర రూ.88 ఉండాలి. ప్యాసింజర్‌ సెస్సు, సేఫ్టీ సెస్సు కలిపి రూ.3, టోల్‌ చార్జీ రూ.5 కలిపి టిక్కెట్టు ధర రూ.96 వసూలు చేయాల్సి ఉండగా, రాజమండ్రి డిపో అధికారులు రూ.150 వసూలు చేయడం గమనార్హం.  

‘రౌండింగ్‌ ఆఫ్‌’ పేరిట చార్జీల సవరణ
ఆర్టీసీలో చిల్లర సమస్యను కారణంగా చూపుతూ ‘రౌండింగ్‌ ఆఫ్‌’ పేరిట టిక్కెట్‌పై రూపాయి నుంచి రూ.5 వరకు అదనంగా వడ్డిస్తూ ఈ ఏడాది జూన్‌లో చార్జీలను పెంచారు. తెలుగు వెలుగు, వెలుగు, సిటీ సర్వీసులు తప్ప మిగిలిన సర్వీసులలో ఈ చార్జీలను పెంచారు. టిక్కెట్లు రద్దు చేసుకుంటే తిరిగి డబ్బు చెల్లించే సమయంలోనూ ‘రౌండింగ్‌ ఆఫ్‌’ వర్తించేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఏడాదికి ప్రయాణికులపై రూ.315 కోట్ల భారం మోపింది.   

మరిన్ని వార్తలు