16 రోజులు.. రూ. 29.44 కోట్లు 

7 Jun, 2020 09:37 IST|Sakshi

రోజుకు సగటున రూ. 1.84 కోట్ల మేర ఆర్టీసీ రాబడి

49 శాతం ఆక్యుపెన్సీ రేషియో

సగటున తిరిగిన బస్సులు 2,323

రేపట్నుంచి బస్సు సర్వీసులు పెంచే దిశగా కసరత్తు

సాక్షి, అమరావతి:  గత నెల 21 నుంచి రోడ్డెక్కిన ప్రగతి రథ చక్రం.. 16 రోజుల్లో రూ. 29.44 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంటే సగటున రోజుకు రూ. 1.84 కోట్ల ఆదాయం సాధించింది. ఇందులో ఆన్‌లైన్‌ ద్వారా రూ. 58 లక్షలు, ఆఫ్‌లైన్‌ ద్వారా రూ.1.26 కోట్ల ఆదాయం వచ్చింది. సాధారణంగా గతంలో 12 శాతం మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా టికెట్ల బుకింగ్‌ జరిగేది. కరోనా కారణంగా ఆన్‌లైన్‌ లావాదేవీలు 32 శాతానికి చేరుకున్నాయి. ఆఫ్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌కు సగటున 1,922 గ్రౌండ్‌ బుకింగ్‌ పాయింట్లు పనిచేశాయి. మొదట్లో కేవలం 17 శాతం ఆపరేషన్స్‌ మాత్రమే ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రారంభించిన విషయం తెలిసిందే. (బియ్యం డోర్‌ డెలివరీకి 8న ట్రయల్‌రన్‌)

సంస్థలో అన్ని రకాల సర్వీసులు కలుపుకుని 14 వేలకు పైగా బస్సులుంటే, రోజుకు సగటున 2,323 బస్సుల్ని తిప్పుతోంది. తెలంగాణలో 70 శాతం బస్సులు తిప్పినా మొదట్లో 20 శాతం ఆక్యుపెన్సీ కూడా రాలేదు. ఏపీఎస్‌ఆర్టీసీ మాత్రం సగటున 49 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. సగటున రోజుకు 8.05 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. ఒక్కో బస్సుకు రోజుకు సగటున రూ. 7,955 ఆదాయం వచ్చింది. దీంతో సోమవారం నుంచి బస్సు సర్వీసులు పెంచేందుకు ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సీట్ల సంఖ్యను కుదించి ఇప్పటివరకు నడుపుతున్న మాదిరిగానే బస్సులు తిప్పనున్నారు. ఇటు అంతర్‌ రాష్ట్ర సర్వీసులను నడిపేందుకు తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు సీఎస్‌ నీలం సాహ్ని లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఈ అంశం నేడు కొలిక్కి రానుంది. ఇదిలా ఉండగా.. లాక్‌డౌన్‌ కాలంలో ఆర్టీసీకి రూ. 1,200 కోట్ల మేర నష్టం వాటిల్లింది. (‘నారాయణ’ టీచర్‌.. అరటి పండ్లు అమ్ముకుంటూ) 

మరిన్ని వార్తలు