పండక్కి ప్రయాణమెలా?

12 Dec, 2017 03:23 IST|Sakshi

జనవరి 11 నుంచి ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ టికెట్లు బ్లాక్‌

ఫ్రాంచైజీల కోసమే రిజర్వేషన్‌ గడువు కుదింపు?

ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనపు దోపిడీ

ఇష్టారాజ్యంగా దండుకుంటున్న ప్రైవేట్‌ ట్రావెల్స్‌

రోజుకో తీరున పెరిగిపోతున్న చార్జీలు

చార్జీలపై రవాణా శాఖ నియంత్రణ శూన్యం  

ముఖ్య రైళ్లలో దర్శనమిస్తున్న ‘నో రూమ్‌’

సంక్రాంతికి ఊరెలా వెళ్లాలో తెలియక ప్రయాణికుల ఆందోళన

సాక్షి, అమరావతి: సంక్రాంతి పండుగకు సొంత ఊళ్లకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఆర్టీసీ గట్టి షాక్‌ ఇచ్చింది. ప్రత్యేక బస్సుల పేరుతో 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. ఇదే అదనుగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ కూడా దోపిడీకి తెరతీశాయి. గతంలో ఆన్‌లైన్‌లో ఆర్టీసీ టికెట్లు రిజర్వేషన్‌ చేసుకు నేందుకు మూడు నెలల గడువు ఉండేది. అంటే ప్రయాణానికి తొంబై రోజులకు ముందుగా టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవచ్చు. ఆర్టీసీ ఈ గడువును 30 రోజులకు కుదించింది. దీంతో సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రయాణి కులకు టిక్కెట్ల రిజర్వేషన్‌ సౌకర్యం అందుబాటులో లేకుండా పోయింది. టికెట్‌ రిజర్వేషన్‌ ఫ్రాంచైజీని ఆర్టీసీ యాజమాన్యం నాలుగు కంపెనీలకు అప్పగించింది. రెడ్‌బస్, అభీబస్, పేటీఎమ్, ఐబిబో కంపెనీలు టికెట్‌ రిజర్వేషన్‌ ప్రాంఛైజీలు పొందాయి. ప్రాంఛైజీల కోసమే ఆర్టీసీ రిజర్వేషన్ల గడువును కుదించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీకి సొంతంగా ఆన్‌లైన్‌ రిజర్వేషన్‌ వ్యవస్థ ఉన్నప్పటికీ ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం గమనార్హం.

ఆర్టీసీ రిజర్వేషన్లకు నెల గడువు విధించినట్లు యాజమాన్యం పేర్కొంటున్నా.. టిక్కెట్లు అందుబాటులో లేకపోవడం గమనార్హం. అంటే పండక్కి ముందు డిమాండ్‌ను సొమ్ము చేసుకునేందుకు టిక్కెట్లను ముందుగానే బ్లాక్‌ చేసినట్లు తెలుస్తోంది. జనవరి 11వ తేదీ తర్వాత ప్రయాణానికి ఆర్టీసీ టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. మరో దారిలేక ప్రైవేట్‌ బస్సులను ఆశ్రయిద్దామంటే టిక్కెట్ల ధరలు షాక్‌ కొడుతున్నాయి. జేబులకు చిల్లు పడేలా పండగ సీజన్‌లో టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా ఉంది.

రైళ్లదీ అదే పరిస్థితి
రైళ్లలో టిక్కెట్ల రిజర్వేషన్లు సైతం గగనంగా మారాయి. రైళ్లలో 120 రోజులు ముందుగా రిజర్వేషన్‌ చేసుకునేందుకు వీలుంది. అయితే ప్రధాన రైళ్లలో చాంతాండంత వెయిటింగ్‌ లిస్టులు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం, తిరుపతి, హైదరాబాద్‌ వెళ్లే ముఖ్య రైళ్లలో ఇప్పటికే ‘నో రూమ్‌’ కనిపిస్తోంది. పైగా దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికీ ప్రత్యేక రైళ్లను ప్రకటించలేదు.
జనవరి 11న ఓ ప్రైవేటు బస్సులో టిక్కెట్టు ధర రూ.1,500గా చూపుతున్న దృశ్యం

ప్రైవేటు ట్రావెల్స్‌ దందా
ఆర్టీసీలో అధిక చార్జీలను సాకుగా చూపి ప్రైవేటు ట్రావెల్స్‌ కూడా ఇష్టారాజ్యంగా దోచుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయి. కాంట్రాక్టు క్యారియర్లుగా అనుమతులు తీసుకుని స్టేజీ క్యారియర్లుగా తిప్పుతున్నా రవాణా శాఖ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. విజయవాడ నుంచి విశాఖపట్నం టిక్కెట్టు ధర రూ.3 వేలకు పైగా చెబుతున్నారంటే ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. టిక్కెట్ల ధరలను కట్టడి చేయాల్సిన రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం మానేశారు.  

‘ప్రత్యేక’ దోపిడీకి రెడీ
ఆర్టీసీ కూడా పండుగ సీజన్‌లో ప్రత్యేక చార్జీల పేరుతో దోపిడీకి రంగం సిద్ధం చేసింది. సాధారణంగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లాలంటే అమరావతి ఏసీ సర్వీసుకు చార్జీ రూ.808. అదే ప్రత్యేక బస్సుకు 50 శాతం అధికంగా వసూలు చేస్తారు. అంటే రూ.1,200కు పైగా చెల్లించాలన్నమాట! ప్రైవేటు బస్సుల్లో విజయవాడ–విశాఖపట్నం రూటుకు జనవరి 11న టిక్కెట్‌ ధర రూ.1,550–రూ.1,800, జనవరి 12న రూ.3 వేలు, జనవరి 13న రూ.3,500 వరకు ఉండడం గమనార్హం. విజయవాడ నుంచి విశాఖపట్నం మధ్య దూరం 337 కిలోమీటర్లు. అంటే కిలోమీటర్‌కు రూ.10కి పైగానే దండుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల పేరిట ఆర్టీసీ అధికంగా వసూలు చేస్తుండగా, తాము డిమాండ్‌ను బట్టి ఎక్కువ తీసుకుంటే తప్పేంటని ప్రైవేటు ట్రావెల్స్‌ నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.
జనవరి 12న అదే టిక్కెట్టు ధర రూ.3000గా చూపుతున్న దృశ్యం

సంక్రాంతి సీజన్‌కు 2,135 ప్రత్యేక బస్సులు  
సంక్రాంతి పండుగ సీజన్‌లో జనవరి 9 నుంచి ప్రతి రోజూ 2,135 ప్రత్యేక బస్సులను విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, ఇతర ప్రాంతాలకు నడుపుతున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధికంగా చార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

టిక్కెట్లు బ్లాక్‌ చేశారు
‘‘ప్రైవేటు బస్సులో ప్రయాణం కంటే ఆర్టీసీ బస్సు సురక్షితమని ఆన్‌లైన్‌లో టిక్కెట్‌ బుక్‌ చేసుకునేందుకు ప్రయత్నించా. కానీ, పండుగ సీజన్‌లో టిక్కెట్లు బ్లాక్‌ చేసినట్లు కనిపిస్తోంది. ప్రైవేటు బస్సుల్లో టిక్కెట్టు ధరలు దారుణంగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ – శ్రీధర్, విజయవాడ

ప్రతి పండక్కీ ఇదే ఆనవాయితీ
‘‘దసరా, దీపావళి, సంక్రాంతి ఏ పండుగకైనా ఇటు ఆర్టీసీ, అటు ప్రైవేటు ఆపరేటర్ల తీరు మారడం లేదు. ఆర్టీసీ టిక్కెట్లను ముందుగానే బ్లాక్‌ చేయడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్నాం. నెల గడువు అని అధికారులు చెబుతున్నా.. నెలకు ముందు రోజు కూడా రిజర్వేషన్‌ దొరకడం లేదు’’ – కిరణ్మయి, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని

ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అధిక చార్జీలు
‘‘ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపితే కచ్చితంగా 50 శాతం అధిక చార్జీలు వసూలు చేస్తాం. ఎందుకంటే తిరుగు ప్రయాణంలో బస్సులు ఖాళీగా రావాల్సి ఉంటుంది. రిజర్వేషన్‌ గతంలో 90 రోజులకు ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వీలుండేది. ఇప్పుడు 30 రోజులకే పరిమితం చేశాం’’   – జయరావు, ఆర్టీసీ ఈడీ

మరిన్ని వార్తలు