ఏసీ సర్వీసులకు ఆర్టీసీ సై!

2 Jun, 2020 10:22 IST|Sakshi

విశాఖ, రాయలసీమకు నడపాలని ఆర్టీసీ నిర్ణయం

దూర ప్రాంతాలకు మరిన్ని బస్సులు

కృష్ణా రీజియన్‌లో 308కి పెరిగిన సర్వీసులు

సాక్షి, అమరావతి బ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏసీ బస్సు సర్వీసులకు విరామం ఇచ్చిన ఆర్టీసీ ఇప్పుడు వాటిపై దృష్టి పెట్టింది. ఇప్పటికే విజయవాడ నుంచి విశాఖపట్నానికి ఇంద్ర ఏసీ బస్సు సర్వీసును ప్రారంభించింది. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరికొన్ని ఏసీ బస్సులను విశాఖ సహా తిరుపతి, కడప, కర్నూలు ప్రాంతాలకు నడపాలని నిర్ణయించింది. మరోవైపు లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో బస్సు సర్వీసులను రోజురోజుకు పెంచుతోంది. కృష్ణా రీజియన్‌ నుంచి రెండు మూడు రోజుల క్రితం వరకు దాదాపు 200 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడపగా సోమవారం నాటికి వీటి సంఖ్యను 308కి పెంచింది. వీటిలో పల్లె వెలుగు బస్సులకు ఆదరణ లేకపోయినా దూర ప్రాంత బస్సులకు మాత్రం డిమాండ్‌ బాగుంది. వీటిలో డిమాండ్‌ ఎక్కువగా ఉన్న విశాఖపట్నం, రాజమండ్రి రూట్లకు ఎక్కువ బస్సులు నడుపుతోంది. (అప్పటివరకు స్కూల్స్‌ తెరవద్దు)

ఉదయం 5 నుంచి రాత్రి 9 వరకు..
ఆర్టీసీ బస్సు సర్వీసులకు అనుమతిచ్చాక ఉదయం ఆరు నుంచి రాత్రి ఏడు గంటల వరకు బస్సులు తిరిగాయి. తాజాగా ఉదయం ఐదు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు బస్సులను నడుపుతున్నారు. పల్లెవెలుగు బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపడం లేదు. ఇప్పటికే సగం సీట్లను కుదించినా వీటిలోనూ సగం మంది కూడా ప్రయాణించడం లేదు. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ పల్లెవెలుగు బస్సులు మరింత నష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని పల్లెవెలుగు సర్వీసులను నడుపుతున్నారు. మరీ ఆదరణ లేని రూట్లలో మాత్రమే సర్వీసులను రద్దు చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, దానికనుగుణంగా బస్సుల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని ఆర్టీసీ కృష్ణా రీజియన్‌ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్‌ ‘సాక్షి’తో చెప్పారు. కాగా, తొలుత గ్రౌండ్‌ బుకింగ్‌ విధానంలో టిక్కెట్లు తీసుకోవడానికి వీలు కల్పించారు. (13% మద్యం దుకాణాల మూసివేత)

మరిన్ని వార్తలు