ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులు

14 Jun, 2020 20:29 IST|Sakshi

ఏపీ నుంచి కర్ణాటకకు బస్సు సర్వీసులకు గ్రీన్‌ సిగ్నల్‌

సాక్షి, విజయవాడ: అంతర్రాష్ట​ బస్సు సర్వీసులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో ఈ నెల 17 నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సహా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులు నడపాలని ఏపీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. తొలుత పరిమిత సంఖ్యలో బస్సులను నడపనుంది. ముందుగా 168 బస్సు సర్వీసులతో ప్రారంభించి అనంతరం నాలుగు దశల్లో మొత్తం 500 బస్సు సర్వీసులకు పెంచనుంది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లా కేంద్రాలు, పట్టణాల నుంచి కర్ణాటకకు బస్సులు నడపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. రేపట్నుంచి (సోమవారం) ఆన్‌లైన్‌లో రిజర్వేషన్లను ప్రారంభించనుంది. apsrtconline.in ద్వారా రిజర్వేషన్ చేసుకునే సదుపాయం కల్పించింది. బస్సుల్లో భౌతిక దూరం, విధిగా మాస్కులు, శానిటైజర్‌ వాడకం తప్పనిసరి.  (2 రోజుల్లో 4 లక్షల మందికి పైగా ప్రయాణం)

అలాగే కర్ణాటక నుంచి రాష్ట్రానికి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక కరోనా వ్యాప్తి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకే ప్రొటోకాల్‌ పాటించాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్‌ ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. లాక్‌డౌన్‌ కారణంగా అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నిలిపివేసింది. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు నేపథ్యంలో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు అనుమతించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలను కోరిన విషయం తెలిసిందే. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై తమిళనాడు మినహా తెలంగాణ, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని లేఖ రాశారు. (ఆర్టీసీ.. ఆన్లైన్ దూకుడు)

మరిన్ని వార్తలు