ఆర్టీసీ సమ్మె విరమణ

8 Jan, 2015 05:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావటంతో పండుగ తరువాత చేపట్టనున్న సమ్మెను విరమించుకుంటున్నట్లు ఎంప్లాయీస్ యూనియన్ ప్రకటించింది. గత రెండు రోజుల నుంచి వాయిదా పడుతున్న చర్చలు బుధవారం ఓ  కొలిక్కి రావటంతో ఈయూ నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు.ఆర్టీసీ కార్మికుల సమస్యలు, డీఏ బకాయిలు, సీసీఎస్ సొమ్ము చెల్లింపు తదితర అంశాలపై తమ డిమాండ్ల పట్ల యాజమాన్యం సానుకూలంగా వ్యవహరించడంతో సమ్మెకు వెళ్లరాదని నిర్ణయించారు. దీంతో  సమ్మెను విరమించుకుంటున్నామని ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖరరెడ్డి, ఇన్‌చార్జి ప్రధాన కార్యదర్శి దామోదరరావు మీడియాకు తెలిపారు.
 
అంగీకరించిన ముఖ్య డిమాండ్లు ఇవే..
క్రెడిట్ కోపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కి యాజమాన్యం నుంచి ఏపీ వాటాగా రావాల్సిన రూ.వంద కోట్ల బకాయిల్లో గురువారం రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. వచ్చే నెలాఖరు నాటికి మొత్తం డబ్బు చెల్లింపు. ఇకపై సీసీఎస్ డబ్బులు యాజమాన్యం వాడుకోకుండా ప్రతి నెలా 10న చెల్లిస్తారు.  ఏడు నెలల డీఏ బకాయిల్లో ఈనెల 12న సగం ఇచ్చి మిగిలిన 50 శాతం మార్చి నెల జీతంలో కలుపుతారు.

కొత్త డీఏ ప్రకటన రాగానే అదే నెలలో బకాయిలతో ఇస్తారు.  ఎస్‌ఆర్‌బీసీ, ఎస్‌బీటీల్లో రుణాలకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఫిబ్రవరి నెలాఖరులోగా మంజూరు.  2011 ఏప్రిల్ 1 నుంచి వర్క్‌షాపు కార్మికుల కు మ్యాన్ అవర్ రేటు బకాయిలను జనవరి, ఫిబ్రవరి ఇన్సెంటివ్‌లు రెండు విడతలుగా ఇస్తారు.
 
ఆర్టీసీ విలీనంపై అధ్యయన కమిటీ ఇచ్చిన నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తారు. విభజన ప్రక్రియ త్వరలో అమలు చేస్తారు. ఆ తర్వాత అన్ని విభాగాల్లో ఖాళీల భర్తీ.  పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలకు సంబంధించిన సర్క్యులర్ జారీకి అంగీకారం.  హైదరాబాద్‌లోని తార్నాక స్థాయి ఆస్పత్రి విజయవాడలో ఏర్పాటుకు ఈడీల కమిటీ పరిశీలనలో ఉంది.
 
2012 డిసెంబరు 31కి ముందు నియమించి న కాంట్రాక్టు కండక్టర్లు, డ్రైవర్లలో మిగిలిన వారందరినీ రెగ్యులర్ చేస్తారు. 2013 జనవరి 1 తర్వాత నియమించిన కాంట్రాక్టు కార్మికులను త్వరలో రెగ్యులర్ చేస్తారు.  డ్రైవర్లు టిమ్స్ మిషన్ల నిర్వహణకు సంబంధించి ఇచ్చే కమిషన్‌లో యాజమాన్యం ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని సవరిస్తారు.

>
మరిన్ని వార్తలు