సంక్రాంతికి సమ్మె తప్పదు!

1 Jan, 2019 13:05 IST|Sakshi

జనవరి 13 నుంచి సమ్మెకు వెళతామని తేల్చిచెప్పిన ఆర్టీసీ కార్మిక సంఘాలు

చైర్మన్, ఎండీలకు నోటీసులిచ్చిన యూనియన్‌ నేతలు

50 శాతం ఫిట్‌మెంట్‌ – ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం డిమాండ్లు

జనవరి 3లోగా చర్చలు జరుపుదామన్న ఎండీ సురేంద్రబాబు  

సాక్షి, అమరావతి: ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. సంక్రాంతి పండక్కి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనున్నారు. జనవరి 4 తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ఖరారు చేసి ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలతో ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు సోమవారం ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్య, ఎండీ సురేంద్రబాబులను కలిసి సమ్మె నోటీసును అందించారు. జనవరి 13 తర్వాత సమ్మెకు వెళతామని యాజమాన్యానికి తేల్చి చెప్పడంతో యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఆర్టీసీ కార్మికులకు ప్రతి నాలుగేళ్లకోమారు జరగాల్సిన వేతన సవరణ 2017 ఏప్రిల్‌ 1 నుంచి జరగలేదు. అప్పట్లో యాజమాన్యం ఆర్టీసీ నష్టాలను సాకుగా చూపి 19% మధ్యంతర భృతితో సరిపెట్టారు.

వేతన సవరణ గడువు దాటి 17 నెలలు కావడం, ఇప్పటికే  చర్చలు పలుమార్లు వాయిదా పడటంతో కార్మిక సంఘాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. ఆర్టీసీని ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తుండటంపై కార్మికులు మండిపడుతున్నారు. ఫిట్‌మెంట్‌ 50% ఇవ్వాల్సిందేనని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే ప్రధాన డిమాండ్లతో ఎంప్లాయిస్‌ యూనియన్‌ నేతలు సమ్మె నోటీసిచ్చారు. ఈ నోటీసుకు ఆర్టీసీలో మిగిలిన సంఘాలు మద్దతు ప్రకటించాయని ఈయూ నేతలు ప్రకటించారు. అయితే జనవరి 3న ఆర్టీసీ యాజమాన్యం ఈయూ నేతలతో వేతన సవరణపై చర్చలు జరపనుంది.

సమ్మె నోటీసులో 18 డిమాండ్లు
ఈయూ నేతలు ఇచ్చిన సమ్మె నోటీసులో 18 డిమాండ్లు ఉన్నాయి. ఫిట్‌మెంట్‌ 50 శాతంతో పాటు అలవెన్సులు వంద శాతం ఇవ్వాలని, డీజిల్‌ కొనుగోలుకు రాయితీ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సిబ్బంది కుదింపు చర్యలు ఉపసంహరించుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. యాజమాన్యం రెండ్రోజుల్లో చర్చలు జరిపేందుకు హామీ ఇచ్చిందని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయాలు లేకుంటే సమ్మె తప్పదని ఈయూ నేతలు వైవీ రావు, పద్మాకరరావులు మీడియాకు వివరించారు. జనవరి 4న ఆర్టీసీలో అన్ని సంఘాలతో కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈయూ నేతలు ఆర్టీసీ చైర్మన్‌ వర్ల రామయ్యను కలిసి సమ్మె నోటీసు అందించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈయూ నేతలు సమాధానమివ్వగా, సీఎం చంద్రబాబు రూ.20 కోట్లు కేటాయిద్దామని తనకు చెప్పారని వర్ల రామయ్య యూనియన్‌ నేతలతో వ్యాఖ్యానించడం గమనార్హం.

మరిన్ని వార్తలు