టిడ్కో 12వ విడత రివర్స్‌ టెండరింగ్‌లో 30.91 కోట్లు ఆదా 

30 Jan, 2020 05:16 IST|Sakshi

సాక్షి, అమరావతి : పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టులలో 12వ విడత రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియలో ఏపీ టిడ్కో రూ.30.91కోట్లు ఆదా చేసింది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో 5,088 హౌసింగ్‌ యూనిట్ల (ఇళ్ల) నిర్మాణానికి టిడ్కో బుధవారం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను పూర్తి చేసింది. మొత్తం రూ.306.61 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించగా, డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ రూ.275.70 కోట్లతో బిడ్‌ దాఖలు చేసి ఎల్‌–1గా నిలిచింది. దాంతో ప్రభుత్వ ఖజానాపై రూ.30.91 కోట్లు భారం తగ్గింది. దీంతో ఏపీ టిడ్కో ఇంత వరకు  మొత్తం 12 విడతల్లో 63,744 ఇళ్ల నిర్మాణానికి రూ.3,239.39 కోట్ల అంచనా వ్యయంతో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ నిర్వహించగా, రూ.2,847.16 కోట్లతో పనులను ఖరారు చేశారు. రూ.392.23 కోట్ల ప్రజాధనం ఆదా అయ్యింది.

పట్టణ గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వివిధ ప్యాకేజిల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.156 నుంచి రూ.316 వరకు వ్యయం తగ్గిందని వివరించారు. వీలైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన వివిధ పనుల్లో మొత్తంగా రూ.1,869.51 కోట్లు ఆదా అయ్యింది.  

మరిన్ని వార్తలు