ప్లాంట్లపై అదే పాట

24 Dec, 2013 03:32 IST|Sakshi
ప్లాంట్లపై అదే పాట

3 విద్యుత్ ప్లాంట్లకు  నోటీసులిచ్చిన ట్రాన్స్‌కో
 ‘సాక్షి’ కథనంలో చెప్పినట్లే సర్కారు వైఖరి


 సాక్షి, హైదరాబాద్: చేతికందిన మూడు విద్యుత్ ప్లాంట్లను జారవిడుచుకునేందుకే ప్రభుత్వం సిద్ధపడుతోంది. స్పెక్ట్రమ్, జీవీకే-1, ల్యాంకో విద్యుత్ ప్లాంట్లను మళ్లీ ఆ కంపెనీలకే కట్టబెట్టేందుకు సై అంటోంది. ఇందులో భాగంగా మరమ్మతులు, ఆధునీకరణ పనులు చేపట్టాలని సూచిస్తూ ఈ మూడు ప్లాంట్లకు ట్రాన్స్‌కో ‘ఆర్ అండ్ ఎం’ (రినోవేషన్ అండ్ మోడర్నైజేషన్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు సోమవారం ఆయా ప్లాంట్లకు అందాయి. స్పెక్ట్రమ్, జీవీకే-1, ల్యాంకో ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం ముగియడానికి వస్తున్న తరుణంలో వీటిని పూర్తిగా స్వాధీనం చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం అందుకు ససేమిరా అంటోందంటూ ‘సాక్షి’లో సోమవారం ‘పవర్ పోతోంది’ శీర్షికన కథనం ప్రచురితమైన సంగతి తెలిసిందే. ట్రాన్స్‌కో తన నోటీసుల్లో ఆర్ అండ్ ఎంకు అయ్యే వ్యయ ప్రతిపాదనలను 2014 మార్చి 31లోగా సమర్పించాలని ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.

విద్యుత్ ప్లాంట్లు అందజేసే వ్యయ ప్రతిపాదనలకు ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఇక ఆ ప్లాంట్లతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆధునీకరణ ద్వారా వాటి జీవిత కాలం ఎంత మేరకు పెరుగుతుందన్నది అంచనా వేసి, ఆ మేరకు వాటి నుంచి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోవాలి. ఇలా చేయడమంటే ఆ విద్యుత్ ప్లాంట్ల ఆధునీకరణకు అయ్యే వ్యయం మొత్తాన్ని ట్రాన్స్‌కో చెల్లించడంతోపాటు, వాటికి ఇంధన ధరలు, బీమా, స్థిరఛార్జీలు, అమలు నిర్వహణ, వర్కింగ్ కేపిటల్ మొత్తాన్ని సమకూర్చాల్సి ఉంటుంది. ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్లు ఆర్ అండ్ ఎం కోసం ఇచ్చే ప్రతిపాదనలు మరీ ఎక్కువగా ఉన్న పక్షంలో.. వాటిని ట్రాన్స్‌కో తిరస్కరించడానికి అవకాశం ఉంది. కానీ రాజకీయ ఒత్తిళ్లతో ప్రతిపాదనలకు ఓకే చెబితే ప్రజలపై మున్ముందు కూడా కరెంటు చార్జీల బాదుడు కొనసాగుతుంది.

>
మరిన్ని వార్తలు